కాంగ్రెస్‌ వ్యూహం : 250 స్ధానాల్లోనే పోటీ

16 Jun, 2018 11:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ రెండో సారి అధికార పగ్గాలు చేపట్టకుండా చెక్‌ పెట్టేందుకు కాం‍గ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిథ్యం పెరిగేలా వీలైనన్ని తక్కువ స్ధానాల్లోనే పోటీకి పరిమితమవాలని ఆ పార్టీ యోచిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కనిష్టస్ధాయిలో కేవలం 250 స్ధానాల్లోనే పోటీ చేయాలని కాం‍గ్రెస్‌ భావిస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కాషాయ కూటమిని అధికార పీఠం నుంచి తప్పించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ మేరకు బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ స్ధానాలు సర్ధుబాటు చేసేలా తాను తక్కువ సీట్లకే పరిమితం కావాలని యోచిస్తున్నట్టు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ బ్లూప్రింట్‌ రూపకల్పనలో నిమగ్నమైంది.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ కమిటీ జిల్లా, రాష్ట్ర కమిటీలతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళతారు. అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం సీట్ల సర్ధుబాటుపై, ఎన్ని స్ధానాల్లో బరిలో దిగాలనే అంశంపై పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొనేందుకు ఏర్పాటైన మహాకూటమిలో చేరే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ప్రాతినిథ్యం కల్పిస్తూ పార్టీ 250 కన్నా తక్కువ స్ధానాల్లో పోటీకి పరిమితం కావాలని పలువురు పార్టీ నేతలు సూచిస్తుండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు