రిసార్టుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

19 Jan, 2019 04:05 IST|Sakshi

సీఎల్పీ భేటీ తర్వాత తరలింపు

బీజేపీ ప్రలోభాల నుంచి తప్పించుకునేందుకే..

నేడు బెంగళూరుకు బీజేపీ ఎమ్మెల్యేలు

సాక్షి బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో మరో సారి రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. ‘ఆపరేషన్‌ కమల’ వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రలోభాల నుంచి తప్పించుకునేందుకు శుక్రవారం తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరు దగ్గర్లోని ఈగల్‌టన్‌ రిసార్టుకు తరలించింది. గత మేలో అసెంబ్లీ ఎన్నికలయ్యాక తమ సభ్యుల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ ఇదే రిసార్టులో ఉంచింది. తాజాగా శుక్రవారం బెంగళూరులో సీఎల్పీ భేటీ ముగిసిన వెంటనే విధానసౌధ నుంచి రెండు బస్సుల్లో వారిని మళ్లీ అదే రిసార్టుకు తరలించింది. ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నంత కాలం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితి, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని కాంగ్రెస్‌ పక్ష నేత సిద్దరామయ్య తెలిపారు.

కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తాయేమోనన్న భయంతోనే మోదీ, అమిత్‌ షా కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌ల ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని పునరుద్ఘాటించారు. తమ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నుంచి రూ .70 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కోల్‌కతాలో ప్రధాని మోదీని ప్రశ్నించారు. మరోవైపు, వారం రోజులుగా గురుగ్రామ్‌లోని రిసార్టులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం బెంగళూరు రానున్నారు.    

సీఎల్పీ భేటీకి నలుగురు డుమ్మా..
కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తమ ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి నలుగురు సభ్యులు రాలేదు. 80 మంది ఎమ్మెల్యేల్లో 76 మంది వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు వ్యక్తిగత కారణాల రీత్యా సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ముందస్తుగానే పార్టీ పెద్దలకు సమాచారమిచ్చారు. అనారోగ్య కారణాలతో గైర్హాజరవుతున్నట్లు చించోలి ఎమ్మెల్యే ఉమేశ్‌జాధవ్‌..సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్యకు ఫ్యాక్స్‌ చేశారు. కోర్టు పని వల్ల సీఎల్పీ భేటీకి హాజరు కాలేకపోతున్నట్లు బళ్లారి(గ్రామీణ) ఎమ్మెల్యే నాగేంద్ర..  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌కు తెలియజేశారు. అయితే గోకాక్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జారకిహోళి, అథని ఎమ్మెల్యే మహేశ్‌ కుమటెళ్లి గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు. రమేశ్‌ జారకిహోళి తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రస్తుతం బీజేపీకి 106 సభ్యుల మద్దతుండగా, ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నాక కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి సంఖ్యాబలం 116కు తగ్గిపోయింది.  

మరిన్ని వార్తలు