కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం

25 May, 2018 10:02 IST|Sakshi
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. పక్కన సీనియర్‌ నేత చిదంబరం

సాక్షి, న్యూఢిల్లీ: గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో విరాళాల కోసం ప్రజల దగ్గర చెయ్యి చాచుతోంది. మీ వంతు సాయం చెయ్యండంటూ గురువారం సాయంత్రం అధికారిక ట్విటర్‌లో ఓ ప్రకటన చేసింది. ‘కాంగ్రెస్‌కు మీ సహకారం, మద్ధతు అవసరం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే మాకు సాయం చెయ్యండి. మీకు తోచినంత సాయం చెయ్యండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది.

కాగా, కాంగ్రెస్‌ పార్టీకి గత కొన్నేళ్లుగా కార్పొరేట్‌ డొనేషన్లు భారీగా తగ్గిపోయాయన్న విషయం ఏడీఆర్‌(Association for Democratic Reforms) నివేదిక తెలియజేసింది. 2014 తర్వాత ఇది మరీ ఎక్కువైపోవటం.. పైగా అది వరుస ఎన్నికల్లో ప్రభావం చూపుతూ వస్తోందని ఆ నివేదిక పేర్కొంది. కాగా, 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. (కర్ణాటకలో జేడీఎస్‌ పొత్తు వేరే విషయం). 2016-2017 ఏడాదిగానూ రూ.225.36 కోట్లు విరాళాల రూపంలో పార్టీకి చేరిందంట. ఇక బీజేపీ రూ. 1,034 కోట్లతో ధనిక పార్టీగా నిలిచింది. 

ఇక కాంగ్రెస్‌ క్రౌడ్‌ఫండింగ్‌కు వెళ్తుందన్న విషయాన్ని ఆ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ ఇన్‌ఛార్జీ రమ్య స్పందన, సీనియర్‌ నేత శశిథరూర్‌లు ముందస్తుగానే తెలియజేశారు. బుధవారం శశిథరూర్‌ తన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ కూడా చేశారు. నిధుల సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్‌ ప్రజల సహకారం కోరటం తప్పని భావించటం లేదు. ఎందుకంటే బీజేపీ డబ్బు రాజకీయాలను ఎదుర్కోవాలంటే అది తప్పనిసరి  అని థరూర్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నేతలకు నిధుల కోరతతో అలవెన్సులు సైతం రద్దు చేసినట్లు సమాచారం. మరో వైపు రమ్య కూడా ఆన్‌ లైన్‌ విరాళాల సేకరణ ద్వారా పారదర్శకత ఉంటుందనే విషయాన్ని గతంలో తెలియజేశారు.

మరిన్ని వార్తలు