...అను నేను!

31 May, 2019 04:00 IST|Sakshi

రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌ ఆర్టికల్‌ 75(4) కింద ప్రమాణం

‘మై నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ ఈశ్వర్‌కీ శపథ్‌ లేతా హూ కీ మై విధిద్వారా స్థాపిత్‌ భారత్‌కే సంవిధాన్‌ ప్రతి సచ్చీ శ్రద్ధా, ఔర్‌ నిష్టా రఖూంగా...’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.  మంత్రులూ ప్రమాణం చేశారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా.. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ...’ అని ప్రమాణం చేశారు.  దేశంలోని రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించే నేతలు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ ప్రకారం ఈ తరహాలో ప్రమాణంచేయాలి. ఈ ప్రమాణస్వీకార సమయంలోనే అధికారిక రహస్యాలకు సంబంధించి మరో ప్రమాణం చేయాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌ ఆర్టికల్‌ 75(4) ప్రకారం ఈ రెండు ప్రమాణస్వీకారాలు చేశాకే ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు బాధ్యతలు చేపట్టాలి.

కేంద్ర మంత్రి ప్రమాణం..
‘...అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ, కేంద్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు.  

 అదే సమయంలో అధికారిక రహస్యాలకు సంబంధించి, ‘...అనే నేను కేంద్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని మరో ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

కుర్తా–పైజామాదే అధిపత్యం
రాష్ట్రపతిభవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా హిందీ ఆధిపత్యం నడిచింది. ప్రధాని మోదీ సహా మెజారిటీ మంత్రులు హిందీలో ప్రమాణస్వీకారం చేయగా, కొందరు మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఇక ఈ వేడుకకు హాజరైన ఎంపీల్లో చాలామంది సంప్రదాయ కుర్తా–పైజామాను ధరించి వచ్చారు. కొంతమంది మాత్రం షర్టులు–ఫ్యాంట్లు వేసుకొచ్చారు. మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి రాగానే సభికులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు.

మరిన్ని వార్తలు