షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు

3 Apr, 2018 01:59 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో షబ్బీర్, మల్లు రవి తదితరులు

     కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్‌ చేస్తాం 

     సింగరేణి కార్మికులకు ఉత్తమ్‌కుమార్‌ హామీ  

     టీఆర్‌ఎస్‌ ప్రచారకర్తగా సీఎండీ శ్రీధర్‌  

     విచారణ జరిపి.. బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరిక  

గోదావరిఖని: కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సింగరేణిలో షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మారు పేర్లతో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. గని కార్మికులకు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. అవకాశం ఉన్నా కొత్త గనులను ప్రారంభించడంలో ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నారు. సంస్థ సీఎండీ శ్రీధర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆయనపై విచారణ జరిపించి బ్లాక్‌ లిస్టులో పెడతామని ఉత్తమ్‌ తెలిపారు. సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధులను సంస్థ విస్తరించిన ప్రాంతాల్లో కాకుండా సీఎం, కేటీఆర్, ఈటల రాజేందర్‌ నియోజకవర్గాలలో ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జైపూర్‌ విద్యుత్‌ కేంద్రంలో ఇప్పటి వరకు పర్మనెంట్‌ ఉద్యోగులను నియమించలేదని పేర్కొన్నారు. సింగరేణి విద్యుత్‌ కేంద్రం నుంచి తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎక్కువ ధరకు ఎలా కొనుగోలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.

300 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్న తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేటు వారికి ఇవ్వడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు అసలే లేరని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధం చెప్పారని, కానీ.. 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారందరినీ పర్మనెంట్‌ చేస్తా మని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. డిస్మిస్‌ అయిన కార్మికులను కూడా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, డి.శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు