సొల్యూషన్‌  లేని ‘అలియాస్‌’ సమస్య

3 Dec, 2023 01:47 IST|Sakshi

సింగరేణిలో ఆ పేర్ల చిక్కుముడి వీడేదెన్నడు?

కారుణ్య ఉద్యోగాలు,పెన్షన్‌లు రాక అవస్థలు

ఏళ్లుగా పట్టించుకోని అధికారులు

వెయ్యి మందికి పైగానే తిప్పలు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో అలియా స్‌(పేరు మార్పిడి) సమస్య చిక్కుముడిగా మారింది. ఈ సమస్య కారణంగా సంస్థ వ్యాప్తంగా సుమా రు వెయ్యి మందికి పైగా కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు రావడం లేదు. ఏళ్ల తరబడి కా ర్యాలయం చుట్టూ తిరిగినా పని జరగక, స్పౌస్‌లకు పెన్షన్‌ రాక అవస్థ పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క కార్మికుల సమస్యలు తెలిసినప్పటికీ గుర్తింపు సంఘం నాయకులు ఆ వైపుగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఏమిటీ సమస్య? 
సింగరేణి సంస్థలో కార్మికులు అవసరమైన సందర్భాల్లో నియమ నిబంధనలు పక్కనపెట్టి... వచ్చిన వారిని వచ్చినట్లుగా నియమించారు. నిబంధనలన్నీ కచ్చితంగా అమలు చేస్తే ఎవరూ రారనే భావనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోగా, ఉద్యోగం వస్తుందనే ఆశ, కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందనే భావనతో చాలామంది మారు పేర్లతో చేరారు.

ఈ ప్రక్రియలో అటు అధికారులు.. ఇటు కార్మికుల తప్పిదం కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఉద్యోగం చేరాక రెండేళ్లకు కార్మికులను పర్మనెంట్‌ చేయడం పరిపాటి. కనీసం అప్పుడైనా కార్మికుల పూర్తి వివరాలు సేకరించి సరైన పేర్లతో పర్మనెంట్‌ చేయాల్సి ఉన్నా.... ఆనా టి సింగరేణి రిక్రూట్‌మెంట్‌ సెల్, విజిలెన్స్, ఇంటిలిజెన్స్‌ విభాగాల అధికారులు పట్టించుకోలేదు.  

స్వయంగా సీఎం చెప్పినా అంతే 
2018 ఎన్నికల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్‌ శ్రీరాంపూర్‌ ఏరియాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ సమస్యపై మాట్లాడారు. కార్మికులకు సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్చి, వారసత్వ ఉద్యోగాల ద్వారా కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే ప్రక్రియను వేగవంతం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.

ఇది జరిగి ఐదేళ్లు కావొస్తున్నా ప్రక్రియ పూర్తికాకపోవడంతో సుమారు వేయి మంది కార్మికులు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారులు శ్రద్ధ కనబర్చకపోవడంతో ఉద్యోగుల పేర్లు మార్చకపోగా, ఇంటి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతరత్రా సమాచారం తప్పుగా నమోదవుతోంది. దీంతో పెన్షన్లు మంజూరు కాక, అర్హులైన కార్మికుల్లో కుటుంబీకులకు వారసత్వ ఉద్యోగాలు లభించక నానా అవస్థలు పడుతున్నారు. 

న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్ణయం తీసుకుంటాం: బలరామ్‌ 
సింగరేణి డైరెక్టర్‌(పా) ఎన్‌.బలరామ్‌ను ఈ విషయమై వివరణ కోరగా... బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశంలో చర్చించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్మికుల పూర్తి వివరాల సేకరణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు