మీరు..అర్హులే కానీ..

4 Nov, 2018 01:06 IST|Sakshi

     కాంగ్రెస్‌లో టికెట్లు రాని నేతలకు బుజ్జగింపులు 

     అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ 

     ఏఐసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ 

     కమిటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ చీఫ్‌ 

     20 మందికి పైగా నేతలకు కౌన్సెలింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టికెట్‌ ఇవ్వలేని పార్టీ నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటోంది. పార్టీలో అసమ్మతి తలెత్తకుండా జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించి పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కేవలం టికెట్లు రాని వారిని బుజ్జగించేందుకు ఏఐసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ టీంను ఏర్పాటు చేయనుంది. ఇందులో పార్టీ జాతీయ ప్రధా న కార్యదర్శి స్థాయికి చెందిన ఇద్దరు నేతలతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఉంటారని సమాచారం. టికెట్‌ కచ్చితంగా వస్తుందని ఆశించి భంగపడిన 20 మందికి పైగా ముఖ్య నేతలను ఈ టీం కౌన్సెలింగ్‌ చేయనుంది.

కౌన్సెలింగ్‌లో కూడా రెండు విధానాలను అవలంబించాలని కాంగ్రెస్‌ పెద్దలు యోచిస్తున్నారు. ముందు గా పొత్తుల్లో సీట్లు కోల్పోతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, కౌన్సెలింగ్‌లో వారికి కచ్చితమైన హామీలు ఇవ్వాలని నిర్ణయించారు. ‘మీరు నిజంగా అర్హులే. కానీ పొత్తుల్లో వేరే పార్టీకి మీ స్థానం ఇవ్వాల్సి వచ్చింది. మీ సేవలను పార్టీ గుర్తించకుండా మానదు. భవిష్యత్‌లో మీకు ఫలానా పదవి ఇస్తాం’అని ఆయా నేతలకు హామీ ఇవ్వనున్నారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీనే పోటీ చేసినప్పటికీ అనివార్య పరిస్థితుల్లో టికెట్‌ ఇవ్వలేని నేతలను కూడా బుజ్జగించనున్నారు. అధికారంలోకి వస్తే తప్పక న్యాయం చేస్తామని వారికి భరోసా ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే, ఈ కౌన్సెలింగ్‌ కోసం నేతలను ఢిల్లీకి పిలిపిస్తారా లేక హైదరాబాద్‌కే ప్రత్యేక బృందం వస్తుందా అన్నది తేలాల్సి ఉంది.  

ప్రచార కేలండర్‌ సిద్ధం.. 
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార కేలండర్‌ను కూడా సిద్ధం చేసుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు కానప్పటికీ ఎక్కడెక్కడ వారి చేత సభలు పెట్టించాలన్న దానిపై టీపీసీసీ ముఖ్యులు ఓ అవగాహనకు వచ్చారు. రాహుల్‌ ఇప్పటికే రెండు ఎన్నికల సభల్లో పాల్గొనగా, మరో 8 చోట్ల ఆయన బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే దక్షిణ, ఉత్తర తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున సోనియా సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వీరితోపాటు మరికొందరు జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 16న వరంగల్, 20 మహబూబ్‌నగర్, డిసెంబర్‌ 1న సినీ నటి ఖుష్బూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి. వీరితో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చౌహాన్, ముఖ్య నేతలు రాజీవ్‌శుక్లా, మన్‌ప్రీత్‌సింగ్‌ బాదల్, శక్తిసింగ్‌ గోయల్‌ తదితరుల పర్యటనలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.   

మరిన్ని వార్తలు