దేశానికి కేసీఆర్‌ కావాలి

31 Mar, 2019 05:22 IST|Sakshi

16 ఎంపీ స్థానాలతో కేంద్రంలో చక్రం తిప్పుతాం 

ములుగు సభలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

సాక్షి, భూపాలపల్లి: జోర్‌దార్, ఇమాన్‌దార్, జిమ్మేదార్‌ అయిన కేసీఆర్‌ నాయకత్వం ఈ దేశానికి అవసరమని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అన్నారు. ములుగులో శనివారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం బీజేపీకి 280 స్థానాలు కట్టబెడితే తెలంగాణకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు, కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు.

కేంద్రంలో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలేనని, ఏర్పడేది నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ కూటములేనన్నారు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమనుకుంటే 55 ఏళ్ల కాంగ్రెస్, 13 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదని నిలదీశారు. దక్షిణాదిలో 130 సీట్లకు గాను 10 కూడా గెల వని కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీ య పార్టీలే తప్పితే జాతీయ పార్టీలు కావన్నారు. 

కేసీఆర్‌ వైపు దేశం చూపు 
దేశం మొత్తం కేసీఆర్‌ వైపే చూస్తోందని, రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు ఇవే అని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. 71 ఏళ్ల స్వాతం త్య్ర చరిత్రలో ఎవరూ అమలు చేయలేని రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ఒక్క కేసీఆర్‌ మాత్రమే తెలంగాణలో తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రైతుబంధు పేరు మార్చి పీఎం కిసాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇవ్వాళ కేసీఆర్‌ ఆలోచన దేశానికి ఆచరణ అయిందని, చివరకు ఆంధ్రా సీఎం సైతం రైతుబంధు స్ఫూర్తితో అన్నదాత సుఖీభవ ప్రవేశపెట్టారన్నారు.

రాష్ట్రంలో 3,400 గిరిజన సర్పంచ్‌లుగా ఉన్నారంటే దానికి కేసీఆరే కారణమన్నారు. ఎన్నికల తర్వా త పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామ న్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి చందూలాల్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు