గుజరాత్‌ ఎన్నికల చిత్రాలు-విచిత్రాలు!

9 Dec, 2017 10:56 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ తొలిదఫా ఎన్నికలు శనివారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ప్రజలు పెద్దసంఖ్యలో ఓటింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, యువత పెద్దసంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఓటింగ్‌ జోరుగా నమోదవుతున్నది. ఉదయం పదిగంటలలోపే 15శాతం ఓటింగ్‌ నమోదైంది. సీఎం విజయ్‌ రూపానీ, బీజేపీ గుజరాత్‌ చీఫ్‌ జితూ వాఘానీ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ తదితరులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ 110 సీట్లు అలవోకగా గెలుచుకుంటుందని అహ్మద్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.

ఓటేసిన తర్వాతే పెళ్లి..!


ఓటుహక్కును వినియోగించుకోవడంలో గుజరాత్ ప్రజలు అత్యంత ఉత్సాహం చూపుతున్నారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్న నూతన వధూవరులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన తర్వాత పెళ్లిపీటలు ఎక్కారు. ఈ ఘటన బరూచ్‌ జిల్లా బహుమలిలో చోటుచేసుకుంది. వివాహానికి ముందు నూతన వధూవరులు తరలివచ్చి..ఓటు చేయడంతో పలువురు వారిని అభినందించారు.

ఓటేసిన క్రికెటర్‌ 


టీమిండియా క్రికెటర్‌ ఛటేశ్వర్‌ పూజారా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రాజ్‌కోట్‌ రవి విద్యాలయ ఎన్నికల కేంద్రంలో ఆయన ఓటు వేశారు. 

మరిన్ని వార్తలు