రంగు మారిన రాజకీయం

11 Jan, 2020 07:28 IST|Sakshi
ఫీర్జాదిగూడలో ఉదయం ఎంపీ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన దయాకర్‌రెడ్డి బోయినపల్లిలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న దృశ్యం

ఫీర్జాదిగూడలో నాటకీయ పరిణామాలు

సాక్షి,మేడ్చల్‌జిల్లా: మున్సిపల్‌ ఎన్నికలు ఊసరవెల్లి రాజకీయాలకు వేదికవుతున్నాయి. టికెట్‌ వేటలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం సహజమే అయినా ఎంపీ  సమక్షంలో ఉదయం ఒక పార్టీలో చేరి.. తర్వాత పార్టీ మార్చి.. తిరిగి సాయంత్రం మంత్రి సమక్షంలో ఉదయం చేరిన పార్టీ కండువా కప్పుకోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశమైంది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని ఫీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జింపింగ్‌ జిలానీలపై ఆయా పురపాలికల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఫీర్జాదిగూడ గ్రామంగా ఉన్నప్పుడు ఉప సర్పంచ్‌గా ఉన్న దర్గ దయాకర్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరుంది. ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ బలోపేతానికి బాగా పనిచేశారన్న గుర్తింపు కూడా అతడికుంది. అయితే, ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అధిపత్య పోరుతో అప్పటి ఎంపీ, ప్రస్తుత మేడ్చల్‌ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యతిరేక వర్గీయుడిగా దయాకర్‌రెడ్డిపై ముద్ర పడింది.

ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో దయాకర్‌రెడ్డి ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, చివరి దశలో దయాకర్‌రెడిని కాదని కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ రియల్టర్‌కు మేయర్‌ పదవి ఖరారు అయిందన్న ప్రచారం నేపథ్యంలో మనస్థాపం చెందిన దర్గ దయాకర్‌రెడ్డి శుక్రవారం ఉదయం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇది తెలుసుకున్న మంత్రి మాల్లారెడ్డి తన అల్లుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ పార్టీ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి దయాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అరగంటకు పైగా సాగిన చర్చల అనంతరం దర్గదయాకర్‌రెడ్డిని మంత్రి మల్లారెడ్డి బోయినపల్లిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి వరకు ఫీర్జాదిగూడ పార్టీ ఇన్‌చార్జి, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాస్‌రెడ్డితో పా టు పార్టీ ముఖ్య నేతలతో కలిసి బుజ్జగించారు. దీంతో మొత్తబడ్డ దయాకర్‌రెడ్డి మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు.  

మరిన్ని వార్తలు