అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ కితాబా?

28 Aug, 2018 01:56 IST|Sakshi

దాసోజు శ్రవణ్‌

సాక్షి, హైదరాబాద్‌: బాధ్యత గల ప్రతిపక్షంగా విద్యాశాఖలో వెలుగు చూసిన అవి నీతిని తాము వెలుగులోకి తెస్తే, తప్పును సరిదిద్దుకోకుండా దొంగలకు సద్ది మోసే విధంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ విమర్శించారు. టీచర్ల బదిలీలపట్ల ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తి గురించి తెలుసుకోకుండా అంతా సంతో షంగా ఉన్నారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కితాబివ్వడం తగదని వ్యాఖ్యానించారు.

సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, నష్టపోయిన వారందరికీ న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్‌ ఆచార్యకు కూడా లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. విద్యా శాఖలో అవినీతి జరగకపోతే వెబ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత సర్దుబాటు పేరుతో ఓడీలు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చేరకపోతే అక్కడ విద్యార్థులు లేరన్న నెపంతో లెక్చరర్లను ఓడీల పేరిట బదిలీలు చేస్తున్నారని, విద్యార్థుల సంఖ్య, రెగ్యులర్‌ లెక్చరర్ల సంఖ్య, ఓడిపై ఏ కళాశాల నుండి ఏ కళాశాలకు పంపారన్న వివరాలను బయటపెట్టాలని   కోరారు. అంతర్‌ జిల్లా బదిలీలు నిర్వహిం చి భార్యాభర్తలకు ఊరట కలిగిస్తామని 2016 మే 21న సీఎం ఇచ్చిన హామీని  బుట్టదాఖలు చేశారని, రెండేళ్ల క్రితం ఇచ్చి న జీవోపై మళ్లీ సీఎం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు