బాబు భ్రమల్లో జీవిస్తున్నారు

1 Dec, 2018 01:33 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రిపై బీజేపీ నేత దత్తాత్రేయ విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: ‘తన వల్లే సైబరాబాద్‌ అభివృద్ధి చెందిందన్న భ్రమల్లో ఏపీ సీఎం చంద్రబాబు జీవిస్తున్నారు. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్‌పేయి చొరవ, ప్రోత్సాహం లేకపోతే హైటెక్‌సిటీ, సైబర్‌టవర్స్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌లు వచ్చేవి కావు. బాబు హయాంలో పేదల భూములను లాక్కుని పెద్దలకు పంచారు. కోకాపేటలో దళితుల భూములను లాక్కుని బాబు పెద్దలకు కట్టబెట్టారు..’అని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్కరి వల్ల సైబరాబాద్‌ అభివృద్ధి కాలేదని.. ప్రజలందరి తోడ్పాటు వల్లే అది సాధ్యమైందని చెప్పారు.  

ప్రజాస్వామ్యంలో ప్రజలే బాద్‌షాలు.. 
తెలంగాణ, ఏపీ సీఎంలు తమని తాము బాద్‌షాలుగా భావిస్తున్నారని.. పాత బాద్‌షాలు పోయి కొత్త బాద్‌షాలు పుట్టుకొచ్చారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాద్‌షాలు అని తెలుసుకోవాలని వారికి హితవు పలికారు. ఇద్దరు చంద్రులు మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. ఆంధ్రాలో అభివృద్ధిని గాలికొదిలేసిన బాబు తెలంగాణలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.  

గెలుపు కోసమే కాంగ్రెస్‌ పంచన.. 
గత ఎన్నికల్లో బీజేపీ సాయంతో ఎన్నికల్లో గెలిచిన బాబు ఈ సారి గెలుపు కోసం కాంగ్రెస్‌ పంచన చేరారని దత్తాత్రేయ విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్‌ పార్టీని స్థాపిస్తే బాబు అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఎన్టీఆర్‌కు రెండోసారి వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రధాని మోదీ చరిష్మా ముందు ఏ కూటములు నిలవవని జోస్యం చెప్పారు. 

మరిన్ని వార్తలు