చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్‌

27 Sep, 2019 20:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా గిరిజనుల జీవితాలను నాశనం చేసే జీవో నెం. 97 ఇచ్చింది చంద్రబాబు కాదా..? 2015 లో జీవో జారీ చేసినపుడు సీఎంగా ఉన్నది మీరే కదా...? గత ప్రభుత్వంలో మీరు గిరిజనులకు ఏం చేశారో చెప్పలేక, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేసి చూపించిన సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదం. గత ఐదేళ్ల మీ పాలనలో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పల్లెల్లో మాఫియాను ప్రోత్సహించారు. కాగా నేడు ప్రభుత్వ ఫథకాలను ప్రజలకు గడప ముంగిటకే చేర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఇలా మాట్లాడటం వల్లే 123 సీట్ల నుంచి 23 సీట్లకు పడిపోయేలా ప్రజలు బుద్ధి చెప్పినా ప్రవర్తనలో మార్పు లేదన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో జిసిసిలో జరిగిన వందల కోట్ల అవినీతిపై విచారణ జరపండి. గిరిజనుల ఉత్పత్తులకు ధర కల్పించకకుండా అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ జరిపి, కోట్ల అవినీతిలో భాగస్వాములైన అధికారులపై చర్యలు తీసుకోమని ఆదేశించారు.

(చదవండి : ‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’)

మరిన్ని వార్తలు