స్కామ్‌ కారకులనే నాడు అప్రమత్తం చేశారు | Sakshi
Sakshi News home page

చాలా నైపుణ్యంగా లూటీ చేశారు.. స్కామ్‌ కారకులనే నాడు అప్రమత్తం చేశారు

Published Thu, Sep 14 2023 4:43 PM

AAG Sudhakar Reddy on Skill Development Scam Press Meet - Sakshi

సాక్షి, విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంను చాలా స్కిల్‌ ఫుల్‌గా జరిపించి..  రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి లూటీ చేశారని అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి సీఐడీ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన కూడా పాల్గొని మాట్లాడారు. 

సీమెన్స్‌ ఏజీ అనే జర్మన్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రేమతో.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ. 3,300 కోట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్టులో 90 శాతం సీమెన్స్‌ కంపెనీ ఇస్తుందని..  ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు. రూల్స్‌ ప్రకారం అది వీలుకాదని అధికారులు అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు. అయితే పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు చేయాలన్న అధికారుల వాదనను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. పైగా ఏపీ ఖజానా నుంచి రూ.371 కోట్లు డిజైన్‌టెక్‌కు చెల్లించారు. 

చాలా నైపుణ్యంగా జరిగిన స్కామ్‌ ఇది. ప్రభుత్వ సంపదను చాలా సులభంగా దోచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన.. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అవకతవకల గురించి పుణే నుంచి జీఎస్టీ అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ ద్వారా అప్రమత్తం చేశారు. 2018, మే 14వ తేదీన ఏపీ ఏసీబీ డీజీకి లేఖ రాశారు.  అంటే.. పుణే నుంచి ఈ స్కామ్‌ బయటపడింది. చూస్కోండి బాబూ.. రూ. 371 కోట్లు హాంఫట్‌ అయ్యాయని లేఖ ద్వారా అలర్ట్‌ చేశారు. అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ స్కాంకు కర్తనో.. ఆ ప్రభుత్వానికే ఆ లేఖ అందింది. అంటే.. కారకులనే పుణే జీఎస్టీ విభాగం అప్రమత్తం చేసిందన్నమాట. అందుకే వ్యవహారం ముందుకు సాగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది అని ఏఏజీ సుధాకర్‌రెడ్డి తెలిపారు.  

ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు అడగబోతుండగా.. తానేం దర్యాప్తు అధికారిని కానని.. కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వాదనలు మాత్రమే వినిపిస్తున్నానని.. అందుకే తనకు చేరిన పత్రాలు, వివరాల ఆధారంగా మీడియాకు సమాచారం ఇస్తున్నానని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement