విశేషాల కొలువు.. ఉద్దండుల నెలవు..

17 Mar, 2019 10:30 IST|Sakshi

సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్‌ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది ఒకే పర్యాయమైనా ఏడేళ్ల సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన అరుదైన అవకాశం, ఆంధ్ర రాష్ట్రం, ఏపీ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆంధ్ర ప్రాంతీయులకే సొంతమైంది. 1956లో ఏర్పాటైన ఏపీ మొదటి శాసనసభ.. మూడు ప్రాంతాలకు చెందిన ఉద్దండులతో మొత్తం తెలుగువారికి వేదికగా కనిపించేది.

బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి తెలుగు ప్రముఖులంతా ఈ సభలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్న సమయంలో (1952) మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఉన్న ప్రాంతం  ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎన్నికయ్యారు. మద్యనిషేధం అంశంపై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు.  

1955 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణా(హైదరాబాద్‌ రాష్ట్రం) కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.తెలంగాణా ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే 1957లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లు మాత్రమే అయినందున 1957 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారికి వేదికగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. 

ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం మొదటి శాసనసభలో కనిపించిన అరుదైన విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి.. తర్వాత కాలంలో దేశ ప్రథమ పౌరునిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు.

ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్‌రెడ్డి తన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి వద్ద తర్వాత మంత్రిగా పనిచేయడం ఈ కాలంలో చోటుచేసుకొన్న మరో ఆసక్తికర సన్నివేశం. 
1955 నుంచి 1962 వరకూ ఏడేళ్లు సభలో ఉన్న వారిలో గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, పుచ్చల పల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రముఖులు ఉన్నారు.1952, 1955లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినవారు కూడా మొదటి శాసనసభలో ఉన్నారు.  

– లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి 

మరిన్ని వార్తలు