ఆజంఖాన్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన ఈసీ

15 Apr, 2019 21:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆజంఖాన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం  కొరడా ఝళిపించింది. బీజేపీ అభ్యర్థి, సినీనటి  జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయనపై వేటు వేసింది. 72గంటలు (మూడు రోజులు) ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆయనపై ఈసీ నిషేధం విధించింది. అదేవిధంగా ముస్లింల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి మేనకా గాంధీపైన ఈసీ చర్యలు తీసుకొంది. 48 గంటలు ప్రచారం నిర్వహించకుండా ఆమెపై నిషేధం విధించింది.  ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు, మతమనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి వరుసగా మూడు రోజులు (72 గంటల పాటు),  రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల  ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్‌ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.  మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్‌పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్‌ సైతం ఆజం ఖాన్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది

మరిన్ని వార్తలు