నేడు మోగనున్న ఎన్నికల నగరా

10 Mar, 2019 11:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ మీడియాకు సమాచారం ఇచ్చింది. లో­క్‌సభ ఎన్నికలతోపాటు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. ఏప్రిల్- మే మధ్య మొత్తం ప్రక్రియ ముగిసేలా.. 7 నుంచి 8 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. జూన్ 3నాటికి లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 10 లక్షల పోలింగ్ స్టేషన్లు అవసరమౌతాయని ఈసీ భావిస్తోంది. అందుకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తోంది. తొలివిడత పోలింగ్‌కు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి.

2014 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5వ తేదీన ప్రకటించారు. ఈసారి మార్చి 10వతేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైంది. పలు దఫాలుగా నిర్వహించనున్న ఎన్నికల కోసం శనివారం ఈసీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల సన్నాహక సమావేశాల కోసం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ను ఈసీ ఇప్పటికే బుక్‌ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో...!
ఏపీలో ఏప్రిల్‌ రెండోవారం ఎన్నికలు జరిగే అవకాశముందని వినిపిస్తోంది. అయితే, టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని.. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌ చివరివారంలో నిర్వహించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన కేసు.. ఓట్ల తొలగింపు కోసం పెద్ద ఎత్తున ఫామ్‌-7 దరఖాస్తులు దాఖలైన వ్యవహారం కలకలం రేపుతుండటంతో ఎన్నికల నిర్వహణ తేదీలపై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

>
మరిన్ని వార్తలు