‘మంత్రుల గైర్హాజరు సిగ్గుచేటు’

4 Oct, 2017 20:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: నగరంలో వరద పరిస్థితిపై మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హైదరాబాద్‌కు చెందిన మంత్రులెవ్వరూ లేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి దానం నాగేందర్‌ విరుచుకుపడ్డారు. నగరంపై అవగాహన ఉన్న మంత్రులను పిలవకుండా నిన్నగాక మొన్న వచ్చి అవగాహనలేమితో నిర్ణయాలు తీసుకుంటున్న కేటీఆర్‌కు ఏమి తెలుసని ప్రశ్నించారు.  బుధవారం బంజారాహిల్స్‌ రోడ్‌నం 10లోని సింగాడికుంట, నాయుడునగర్‌ బస్తీలలో ఆయన పర్యటించి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. గత ఏడాది ఇలాంటి వరదలే వచ్చినప్పుడు కేటీఆర్‌ ఆరు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. మళ్లీ మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలోను, ఒక్క రోజులో అంతా సర్ధుకుంటుందని మంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడైనా పరిస్థితి సద్దుమణిగిందా అని నిలదీశారు. హైదరాబాద్‌లో వరస వస్తే చెరువులను తలపిస్తున్నాయని పక్కా ప్రణాళిక లేకుండా  అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారని దానం ఆరోపించారు.

నాయుడు నగర్లో చుట్టూ మట్టి కుప్పులతో పాటు రాళ్లు పేరుకుపోయాయని  సోమవారం నాటి వరదలు మళ్లీ వస్తే ఇవన్నీ కొట్టుకొచ్చి గుడిసెలను ముంచెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా స్థానికులు తినడానికి తిండి లేక ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు నష్టపరిహారం ఇస్తామని పేర్కొన్నారని ఈ డబ్బుతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. వైట్‌ ట్యాపింగ్‌ రోడ్లు వేస్తున్నట్లు గతంలో ప్రకటించారని ప్రధాన రోడ్లు సన్నగా చేసి అంతర్గత రహదారులను గాలికి వదిలేశారన్నారు. ఇక్కడి మృతుల కుటుంబానికి కాంగ్రెస్‌ తరపున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు దానం నాగేందర్‌ వెల్లడించారు.

నా ఇంటి ముందు చెట్టు విరిగిపడ్డా..
సోమవారం భారీ వర్షానికి జంబారాహిల్స్‌ రోడ్‌ నం.3లోని తన ఇంటి ముందు ఓ చెట్టు విరిగిపడిందని దీంతో తాను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదని దానం ఆరోపించారు. తరువాత మెస్సేజ్‌ పెట్టానని అన్నారు. ఆ కొద్దిసేపటికి డీఎంసీకి కూడా ఫోన్‌ చేసి ఈ సమస్యను చెప్పానన్నారు. 24 గంటలు గడిచినా రెస్య్కూ టీమ్‌ రాలేదని మాజీ మంత్రి ఇంటి వద్దే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల ప్రాంతాల్లో ఎంతటి అలక్ష్యం చోటు చేసుకుంటున్నదో ఈ ఘటన అద్దం పడుతుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు