మీడియాను చూసి నాలుక్కరుచుకున్న మాజీ ఎమ్మెల్యే

20 Mar, 2019 11:44 IST|Sakshi
కందుకూరు ఎన్నికల ప్రచార  సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దివి శివరాం

బట్టబయలయిన టీడీపీ దుష్ట వ్యూహం

రౌడీయిజం చేసైనా గెలుద్దాం!

ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం

సాక్షి, కందుకూరు:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికారపార్టీ కుట్రలు, కుతంత్రాలు, బరితెగింపు, బెదిరింపులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడబోమని నిరూపిస్తున్నారు. తాము అనుసరించబోయే అక్రమ కార్యకలాపాల వ్యూహమేంటో చెప్పకనే చెబుతున్నారు. ‘ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైతే రౌడీయిజం చేద్దాం. దాంట్లో తప్పేమి లేదంటూ బహిరంగంగానే ప్రకటించి’ తమ నైజాన్ని చాటుకున్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో  రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌  చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చేసిన వ్యాఖ్యలే.. వారి దుష్ట వ్యూహాలను బయటపెట్టాయి. ఎమ్మెల్యే పోతుల రామారావు సాక్షిగా..శివరాం చేసిన ఈ వ్యాఖ్యలపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.  

అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నం.. 
కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గాలి ప్రభంజనంలా వీస్తోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇప్పటికే వందల మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీకి గుడ్‌బై చెప్పి, మాజీ మంత్రి, కందుకూరు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మహీధర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరిపోయారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు పార్టీ ఫిరాయించి, టీడీపీలో చేరడంతో.. అప్పటి వరకు పెత్తనం చేసిన దివి శివరాం వర్గానికి మధ్య విబేధాలు తలెత్తాయి.

పార్టీలో అసంతృప్తులు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఆ అసంతృప్తులు నేటికీ చల్లారడం లేదు.  అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అటు పార్టీని కాపాడుకోవడంతోపాటు ఇటు ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఎన్నికల రోజు ఎలాగైనా అల్లర్లు సృష్టించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయాలనే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు శివరాం వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రౌడీయిజం చేసైనా ఎన్నికల్లో గెలుద్దామని బహిరంగంగా కార్యకర్తలకు చెబుతూ.. మీడియా ఉందని  గమనించి నాలుక్కరుచుకున్నారు. దీంతో కందుకూరులో  పాత రోజులు మళ్లీ పునరావృతమవుతాయా అంటూ చర్చలు మొదలయ్యాయి.    

మరిన్ని వార్తలు