నమ్మితే నట్టేట ముంచారు.. లోకేష్‌ హామీకే దిక్కులేదు...

20 Mar, 2019 11:38 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  తెలుగుదేశం పార్టీలో సీట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.  నిన్నటికి నిన్న తన సతీమణి ఆరోగ్యం బాగోలేదని, ఎన్నికల బరి నుంచే కాకుండా ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించిన బుడ్డా రాజశేఖరరెడ్డి.. తిరిగి పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల వ్యయాన్ని భరించేందుకు ఎంపీ అభ్యర్థి మాండ్ర ముందుకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.

మరోవైపు సీటు దక్కని అభ్యర్థులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నమ్మితే నట్టేట ముంచారంటూ వాపోతున్నారు. ఏకంగా మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చినప్పటికీ తనకు సీటు ఇవ్వకపోవడంపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడుతున్నారు. లోకేష్‌ హామీకే దిక్కులేకుండా పోయిందంటూ తన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలులో మంగళవారం జరిగిన చంద్రబాబు సభకు  గైర్హాజయ్యారు.

ఇక నంద్యాల సీటు విషయంలో తమకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని మండిపడిన ఎంపీ ఎస్పీవై రెడ్డి స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాము నామినేషన్‌ వేస్తున్నట్టు వెల్లడించారు. చివరి వరకు నీకే సీటు ఇప్పిస్తామని నమ్మించిన కోట్ల వర్గం కూడా తుదకు చేతులెత్తేయడంతో మణిగాంధీ వేదన చెందుతున్నారు. అందరూ కలసి తనను మోసం చేశారంటూ వాపోతున్నారు.

కోడుమూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన రామాంజినేయులు.. మణిగాంధీని కలిసి సహకరించాలని కోరినట్టు తెలిసింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇక నిన్నటివరకు కనీసం శ్రీశైలం సీటైనా దక్కుతుందని భావించిన ఏవీ సుబ్బారెడ్డికి చివరకు నిరాశే మిగిలింది. అంతేకాకుండా తాను వద్దన్న భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ప్రకటించడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సీట్ల వ్యవహారం కాక రేపుతోందనే చెప్పవచ్చు.  

ఏకాంతంగా భేటీ..బుడ్డా అంగీకారం 
తన సతీమణి ఆరోగ్యం బాగోలేనందున తాను ఎన్నికల బరితో పాటు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి సోమవారం ప్రకటించారు.  చంద్రబాబు పర్యటన ముందు రోజు ఈ పరిణామం జరగడంతో అధికార పార్టీలో కలవరం మొదలయ్యింది. చిత్తుగా ఓడిపోతాననే ఆందోళనతోనే ఈవిధంగా తప్పుకోవాలని బుడ్డా భావించినట్టు తెలుస్తోంది. పార్టీ మారిన సమయంలో ఇచ్చిన మొత్తంతో పాటు ఆ తర్వాత కూడా బాగా సంపాదించినందువల్ల ఎన్నికల ఖర్చు ఇవ్వలేమని అధినేత తేల్చిచెప్పారు.

దీంతో సంపాదించిన మొత్తాన్ని ఎన్నికల కోసం ఖర్చు పెట్టినా గెలిచే అవకాశం లేనందువల్ల బరి నుంచి తప్పుకోవాలని బుడ్డా భావించినట్టు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు పర్యటన సందర్భంగా కర్నూలుకు రావాలంటూ కబురు పంపడంతో మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బుడ్డాతో అరగంట పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల ఖర్చు భరిస్తానని హామీనిచ్చారు. చంద్రబాబు వద్దకు కూడా బుడ్డాను తీసుకెళ్లి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో తిరిగి బరిలో నిలిచేందుకు బుడ్డా అంగీకరించినట్టు తెలుస్తోంది.  

పుండు మీద కారం.. 
ఇప్పటికే సీటు రాక ఇబ్బంది పడుతున్న ఎస్వీ మోహన్‌రెడ్డిని సభ సాక్షిగా చంద్రబాబు మరింతగా అవమానించారు. సమర్థులకే సీట్లు ఇచ్చానని.. అందులో భాగంగా కర్నూలుకు టీజీ భరత్‌ను ఎంపిక చేశామని ప్రకటించారు. తద్వారా ఎస్వీ మోహన్‌రెడ్డిని అసమర్థుడిగా పేర్కొన్నారని ఆయన వర్గీయులు వాపోతున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీ అభ్యర్థికయ్యే ఖర్చు సుమారు రూ.100 కోట్ల మేర భరించేందుకు సిద్ధం కావడంతోనే టీజీ భరత్‌కు సీటు ఇచ్చేందుకు కోట్ల కూడా మద్దతిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇక భరత్‌ కూడా తనకు సీటు రావడానికి తండ్రి టీజీ వెంకటేష్‌ స్ట్రాటజీ పనిచేసిందని అనడంతో సభకు హాజరైన వారందరూ ముక్కున వేలేసుకున్నారు.    

మరిన్ని వార్తలు