మధ్యప్రదేశ్‌లో హైడ్రామా..

16 Mar, 2020 08:11 IST|Sakshi
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్‌సీ ప్రజాపతి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో సోమవారం బలనిరూపణ చేసుకోవాలని పాలక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆదేశించిన క్రమంలో బలపరీక్ష జరిగే దాఖలాలు కనిపించడం లేదు. అసెంబ్లీ స్పీకర్‌ జారీ చేసిన సభా కార్యక్రమాల (లిస్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌) జాబితాలో విశ్వాసతీర్మానం ప్రస్తావన లేకపోవడం ఈ సందేహాలకు తావిస్తోంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం, ఆయన ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం గురించే హౌస్‌ బిజినెస్‌ జాబితాలో పొందుపరిచారు. స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతి సైతం విశ్వాస పరీక్షపై నోరు మెదపకుండా రేపు (సోమవారం) ఏం జరుగుతుందో మీరే చూస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. 22 మంది కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

మరోవైపు ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థ పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో అసెంబ్లీలో చేతులు ఎత్తడం ద్వారా బలపరీక్ష చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ ఎల్జీ టాండన్‌ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడంతో సభలో సభ్యుల సంఖ్య 222కు పడిపోగా ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ మార్క్‌ 112. ఇక తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ పేర్కొనగా, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు.

చదవండి : ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు