‘గాలి’ అరెస్ట్‌ వెనక కుమారస్వామి?

13 Nov, 2018 19:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కొందరు పోంజి స్కీమ్‌గా అభివర్ణించే పాన్సీ స్కీమ్‌ స్కామ్‌లో బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లడం వెనక కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రతీకారం ఉందా? 1600 కోట్ల రూపాయల మైనికంగ్‌ కుంభకోణం కేసులో 2011లో అరెస్టైన గాలి జనార్ధన్‌ రెడ్డి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే. 600 కోట్ల రూపాయల పాన్సీ స్కీమ్‌ నుంచి నిందితులను తప్పించేందుకు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వీకరించారన్నది గాలి జనార్దన్‌ రెడ్డిపై తాజా ఆరోపణ.

ముఖ్యమంత్రి కుమార స్వామికి, గాలి జనార్దన్‌ రెడ్డి మధ్య కొనసాగుతున్న గొడవ 2006 నాటిది. ఆ నాడు అసెంబ్లీ శాసన సభ్యుడైన కుమార స్వామి ముఖ్యమంత్రి అవడం కోసం ఇద్దరు బీజేపీ నాయకులు, తన జేడీఎస్‌ పార్టీకి చెందిన ఓ యువజన నాయకుడి కోటరీతో కుట్ర పన్ని అప్పటి ధరమ్‌సింగ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే బీజేపీకి నిధులు సమకూర్చే నాయకుడిగా ముద్రపడిన గాలి జనార్దన్‌ రెడ్డిని ఆయన తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.  కుమార స్వామి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాకముందే మైనింగ్‌ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించారంటూ గాలి జనార్దన్‌ ఆరోపించారు. ఆ తర్వాత కొంతకాలానికే బీజేపీతో చేసుకున్న అధికార మార్పిడి ఒప్పందం ప్రకారం సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

‘నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పట్టుమని ఐదు నెలలు కూడా కాలేదు. నా సంకీర్ణ భాగస్వామ్య పక్షం నాయకుడే నాపై అవినీతి ఆరోపణలు చేశారు. నేనా విషయాన్ని నా జీవిత కాలంలో ఎన్నడూ మరవను’ అని ఈ ఏడాది కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందు విలేకరులతో వ్యాఖ్యానించారు. గాలిపైనున్న ప్రతీకార జ్వాలల కారణంగానే కుమార స్వామి బీజేపీతోని కాకుండా కాంగ్రెస్‌ పార్టీతోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు నేటికీ భావిస్తున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో గాలి జనార్దన్‌ రెడ్డి లాబీకి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేశారు. దాంతో బీజేపీ నాయకులు శ్రీరాములు తరఫున గాలి జనార్దన్‌ రెడ్డి చేసిన ప్రచారానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆమోద ముద్ర వేయలేక పోయారు. పార్టీ కార్యకర్తగా కాకుండా వ్యక్తిగత హోదాలో శ్రీరాములుకి గాలి జనార్దన్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అమిత్‌ షా చెప్పాల్సి వచ్చింది.

ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలంగా ఉన్న బళ్లారి ప్రాంతంలో బీజేపీ బలపడడానికి శ్రీరాములుతో కలిసి గాలి జనార్దన్‌ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఒకప్పుడు అంటే 1999లో బీజేపీ తరఫున విస్తృత ప్రచారం సాగించిన సుష్మా స్వరాజ్‌పై సోనియా గాంధీ బళ్లారి నుంచి విజయం సాధించారంటే కాంగ్రెస్‌ బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితి నుంచి బళ్లారి నుంచి అన్ని సీట్లు బీజేపీ గెలుచుకునే స్థాయికి బీజేపీ బలపడింది. గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో బళ్లారి ప్రాంతంలోని 9 అసెంబ్లీ సీట్లకు గాను ఆరు సీట్లను కాంగ్రెస్‌ పార్టీ తిరిగి గెలుచుకుంది. మొన్న బళ్లారి లోక్‌సభకు జరిగి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన ఉగ్రప్ప చేతిలో శ్రీరాములు సోదరి శాంత ఓడిపోయారంటే మళ్లీ కాంగ్రెస్‌ ఎంత పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు.

గాలిపై దాఖలైన అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రి కుమార స్వామి పంతం పట్టి ముందుకు తీసుకెళుతుండడం, ప్రస్తుతం గాలిని దగ్గర తీయడం నష్టమే ఎక్కువని, ఆయన్ని బీజేపీ దూరంగా ఉంచడం వల్ల అవినీతి కేసులో గాలి అరెస్టైయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు