మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు

30 Aug, 2023 16:32 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. 

వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. 


గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్‌ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్‌ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.

ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు..

మరిన్ని వార్తలు