-

వాటికి కోర్టులోనే సమాధానమిస్తా : గంభీర్‌

10 May, 2019 11:43 IST|Sakshi

న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. పరస్పర విమర్శలతో బీజేపీ- ఆప్‌ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలో తనపై ఆరోపణలు చేస్తున్న ఆప్‌ నేతలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ నోటీసులు పంపించారు. అసత్య ఆరోపణలు చేసినందుకు గానూ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, ఆప్‌ నేత అతిషిలకు తన లాయర్‌ ద్వారా నోటీసులు పంపించారు.

అసలేం జరిగిందంటే.. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున గంభీర్‌ ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఆప్‌ తమ అభ్యర్థిగా ఆతిషిని ప్రకటించింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ప్రచారంలో పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న కరపత్రాలు పంచారు. ఈ నేపథ్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ఆతిషి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో రాజకీయ ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేకే గౌతం గంభీర్‌ ఇలాంటి నీచానికి పాల్పడ్డారని, మహిళా అభ్యర్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, ఆతిషి ఆరోపించారు.

కాగా ఈ విషయంపై స్పందించిన గంభీర్‌... ఆతిషిని కించపరుస్తూ పాంప్లెట్లు పంచింది తానేనని నిరూపిస్తే.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. ‘ మీరు నిజాలే మాట్లాడి ఉంటే చట్టబద్ధంగా పోరాడండి. నాకు వ్యతిరేకంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు పెట్టండి. కోర్టులోనే వాటికి సమాధానం చెబుతా’ అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో గంభీర్‌ తరఫున కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ కుమార్తె సొనాలి జైట్లీ ఆప్‌ నేతలకు నోటీసులు పంపించారు. దీంతో.. ‘ చీప్‌ ట్రిక్కులు చేస్తున్న నువ్వే క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గురించి ఇలాంటి ఆరోపణలు చేస్తూ పాంప్లెట్లు పంచడానికి నీకెంత ధైర్యం. సిగ్గులేదా. మేమే నీపై కేసు వేస్తాం’ అంటూ మనీష్‌ సిసోడియా ఘాటుగా స్పందించారు. ఇక మే 12న ఢిల్లీలో పోలింగ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు