‘ఇంకా రాజకీయాలు చేయొద్దు’

5 Mar, 2018 17:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చేందుకు అంగీకరించామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ప్రత్యేక హోదా సాధ్యం కాకపోవడంతోనే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు నిధుల్లో 30 శాతం తేడా ఉంటుందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని ప్యాకేజీ రూపంలో ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారని చెప్పారు.

ప్రత్యేక హోదాతో సమానంగా ప్యాకేజీ నిధులు వస్తాయని, కొంతమంది హోదా పేరుతో రాజకీయం చేస్తున్నారన్నారు. విభజన హామీల అమలుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 9 జాతీయ సంస్థలను ఏపీకి ఇచ్చామని, మరిన్ని సంస్థలను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. పన్ను రాయితీలను కూడా కేంద్రం ప్రకటించిందని, ఇంకా రాజకీయాలు చేయడం మంచిది కాదని నరసింహారావు అన్నారు.

మరిన్ని వార్తలు