‘టీఆర్‌ఎస్‌లో సైనికుడిని’

20 Feb, 2019 03:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రమశిక్షణ గల సైనికుడిగా పని చేస్తున్నానని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధినేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఆదేశాలను అమలు చేస్తానని అన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పదులసార్లు స్పష్టం చేశానని, ఎన్నికల సమయంలోనూ చెప్పానని తెలిపారు. తనకు సంబంధించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న చెడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన పేరుతో ఎలాంటి గ్రూపులు, సేనలు లేవని... ఎవరైనా ఇలాంటివి పెట్టుకుంటే సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పారు. (కీలక శాఖలు అన్ని కేసీఆర్‌ వద్దే)

మంగళవారం రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తా. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ముఖ్యమంత్రిగారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాలు, ఇతర సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ నాకు ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణగల కార్యకర్తగా అమలు చేస్తాను. మంత్రివర్గంలో చోటు విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఎవరైనా సోషల్‌ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరు పార్టీ కోసం, కేసీఆర్‌ కోసం పనిచేయాలి. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారికి శుభాకాంక్షలు, అభినందనలు. ఉద్యమ నేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రెండోసారి టీఆర్‌ఎస్‌ పార్టీని అధికారంలోకి తీసు  కొచ్చారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. కొత్త మంత్రులు పూర్తిస్థాయిలో మంచిగా పనిచేసి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నా’అని అన్నారు.

>
మరిన్ని వార్తలు