ఒక ‘వేట’.. 12 తుపాకులు

10 Nov, 2017 02:48 IST|Sakshi

ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం పీఠంపై డజన్‌ మంది గురి!

ఢిల్లీ నుంచి గల్లీదాకా వీళ్లదే హల్‌చల్‌

ఎవరికి వారే సీఎం అభ్యర్థులుగా ప్రచారం

ఉత్సాహంగా ఢిల్లీకి.. రాహుల్‌తో భేటీలు

సీనియర్లకు దీటుగా రేవంత్‌ పరుగులు

తానేమీ తీసిపోలేదంటూ ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో భేటీ అయిన విజయశాంతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతల హడావుడి పెరిగింది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్‌ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇప్పటిదాకా తెరవెనుక ఉన్న నేతలంతా ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నారు. పీసీసీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా ముఖం చూపించడానికే ఇష్టపడని నేతలు.. ఇప్పుడు అందరి కంటే ముందే వచ్చి వాలుతున్నారు. మీడియా సమావేశాల్లో పాల్గొనడానికి విపరీతమైన పోటీ పెరిగింది. ఏంటబ్బా అని ఆరా తీస్తే.. ఇంకేముంది అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకే ఈ హడావుడి అని ఓ సీనియర్‌ ఎమ్మెల్యే చమత్కరించారు!

‘‘నేను తప్ప మా ఎమ్మెల్యేలందరూ వీలైతే పీసీసీ అధ్యక్షుడో లేదా ప్రచార కమిటీ చైర్మన్‌ పదవో వస్తే బాగుండునన్న ఫీలింగ్‌లో ఉన్నారు. అంతేకాదు...వీలైతే సీఎం పీఠానికి తక్కువవేమీ కాదన్న ధీమా మా వాళ్లలో ఉంది’’ అని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎటూ రేసులో మొదటి స్థానంలో ఉంటారు కదా అని అడగ్గా.. ‘‘భలేవారండీ.. జానారెడ్డి గారు తాను సీఎం పదవి తప్ప అన్నీ చేశాను ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిని చేపట్టాల్సిందేనని ఘంటాపథంగా చెపుతున్నారు కదా..’’ అని అన్నారు సదరు ఎమ్మెల్యే.

సీఎం రేసులో వీరే..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందో రాదో కానీ.. వస్తే ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్న వారి సంఖ్య ఏకంగా డజను మందికి పైనే ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ ఎటూ ఆ పదవి తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. కానీ ఎన్నికల దాకా ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారా అన్నది సీఎం పదవిపై కన్నేసిన వారి ఆశ. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను మార్చే అవకాశం లేదని ఢిల్లీ నుంచి లీక్‌లు వస్తున్నాయి. అయినా ఎవరి ప్రయత్నం వారిదే. ఉత్తమ్‌ను మారిస్తే తమకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ డి.కె.అరుణ (మహబూబ్‌నగర్‌), కోమటిరెడ్డి బ్రదర్స్‌ (నల్లగొండ), దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి (మెదక్‌), వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ (హైదరాబాద్‌) ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ప్రయత్నం చేయకపోయినా సీనియర్‌ కాంగ్రెస్‌ నేతగా, నిజాయితీ కలిగిన రాజకీయవాదిగా పీసీసీ పీఠమిస్తే సాధ్యమైనంత చేయగలనని టి.జీవన్‌రెడ్డి (కరీంనగర్‌) ఆశిస్తున్నారు.

అయితే ఆయన ఈ విషయంలో లాబీయింగ్‌లకు దూరం. వీరిలో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. సీఎం పదవికి తాము ఏ మాత్రం తీసిపోమన్నది వారి ధీమా! ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు ఎంత అవకాశం ఉంటుందో సీఎల్‌పీ నేతగా తనకు అంతే అవకాశం ఉంటుందని జానారెడ్డి కూడా చెబుతున్నారు. బహిరంగంగా అనకపోయినా ఆయన వర్గీయులు ఈ మధ్య కాలంలో ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇంతేనా అంటే... మరి రాజకీయాల్లో కురువృద్ధుడు జైపాల్‌రెడ్డి సంగతేమిటి? రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జైపాల్‌రెడ్డి ఒక్కరే సీఎం పీఠానికి అర్హులన్న అభిప్రాయం కొందరు కాంగ్రెస్‌ నేతల్లో ఉంది.
 

రేవంత్, విజయశాంతి కూడా..
టీడీపీలో ఉంటే ఎప్పటికీ సీఎం పీఠం దక్కదని భావించి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. రేవంతే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో కార్యకర్తలు ప్లకార్డులు కూడా పట్టారు. రేవంత్‌కు ఉన్న జనాదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదన్న వాదన బయలుదేరింది. రేవంత్‌ హడావుడి ముగిసిందో లేదో ఇంతకాలం తెరచాటున ఉన్న సినీనటి విజయశాంతి కూడా ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని కలిశారు. విచిత్రమేమిటంటే విజయశాంతి తాజాగా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆమె వర్గీయులు ప్రచారం చేశారు. అయితే గడచిన శాసనసభ ఎన్నికల్లో ఆమె మెదక్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ప్రచార బాధ్యతలు తన భుజాన వేసుకుంటానని ఆమె గంభీరమైన ప్రకటన చేశారు. రాహుల్‌ కూడా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని ప్రచారం సాగుతోంది.. ఇదండీ కాంగ్రెస్‌లో హడావుడి... ఆర్భాటం...ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ హడావుడి మరింత పెరిగేలా ఉంది! 

మరిన్ని వార్తలు