ఆ విషయం బాబు గుర్తు పెట్టుకోవాలి: రాజ్‌నాథ్‌

18 Jan, 2019 18:09 IST|Sakshi

కడప: ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ భూస్థాపితమేనన్న విషయం బాబు గుర్తు పెట్టుకోవాలని చురకలంటించారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు వచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు.

‘ఎన్టీఆర్ వర్థంతి రోజున కడపకు రావడం గర్వ కారణం. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్‌ వ్యతిరేకించారు. దేశ ఔన్యత్యాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ సిద్దాంతాలను పాటిస్తాం. ఇద్దరు ఎంపిలతో ప్రారంభమై మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెసేతర పార్టీగా బీజేపీ ఎదిగింది. దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక బలమైన దేశాల్లో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. పార్లమెంట్‌లో బలంగా ఉన్నా భాగస్వామ్య పార్టీలను బీజేపీ గౌరవిస్తూనే ముందుకు వెళుతుంది. మాజీ ప్రధాని పీవీ నర‍్సింహారావు పట్ల కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిన తీరును బాబు గుర్తుపెట్టుకోవాలి. దేశ ఔన్నత్యం కోసం పాటు పడిన వారి ఏ పార్టీకి చెందిన వారైనా బీజేపీ గౌరవిస్తుంది. గ్రామీణ ప్రజల, అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను కేంద్రం అమలు చేసింది.

యాభై సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో మహిళల ఇళ్లల్లో దీపాలను వెలిగించలేకపోయారు. నాలుగున్నర ఏళ్లలోనే ఇంటింటికి విద్యుత్‌ సరఫరా అందించిన ఘనత బీజేపీది. అవినీతి ప్రభుత్వాల, పాలకుల భరతం పట్టిన కేంద్ర ప్రభుత్వం.. పాకిస్తాన్‌ టెర్రరిస్టులను వాళ్ల భూ భాగంలోనే మట్టుబెట్టింది. కాంగ్రెస్‌ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టా భూస్థాపితమేనన్న విషయం బాబు గుర్తుపెట్టుకోవాలి. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నా ఆ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేదు.  విభజన చట్టంలో పొందు పరచిన 80శాతం హామీలకు కేంద్రం అమలు చేసింది.  ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినా సరైన సమాచారం బాబు సరైన సమాచారం ఇవ్వలేదు.  రాష్ట్ర, జిల్లాల అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులను మంజూరు చేసిన మోదీ..ఆంద్ర ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు