ఒకే మాట ఒకే బాట

9 Jan, 2019 04:38 IST|Sakshi

నిఖార్సయిన నేత.. నిలువెత్తు నిబద్ధత 

కన్నీళ్లు తెలిసిన నేత.. పరిష్కారం చూపే పరిణతి 

కసితో మొదలై.. కన్నీళ్లు తుడిచే శక్తయి.. 

విలువల మాట.. విశ్వసనీయతే బాట 

పాదయాత్ర తర్వాత జనవాక్కు ఇదే.. 

‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలన్నదే నా తాపత్రయం’.. ..ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాట యావత్‌ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్ని సూటిగా తాకింది. నాయకుడంటే ఇలా ఉండాలన్న జనాభిప్రాయం ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా వ్యక్తమవుతోంది. ఏ మూలనో చిన్న అనుమానం ఉన్న వారు కూడా ఈ వ్యాఖ్యతో ఆయనపై నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. అసలు సిసలైన నాయకుడంటే జగనే అని ఘంటాపథంగా చెబుతున్నారు.  

సాక్షి, అమరావతి : పద్నాలుగు నెలలకు పైగా ప్రజాక్షేత్రంలో ఉన్న వైఎస్‌ జగన్‌ అనుక్షణం జనం కష్టసుఖాలే ఆలకించారు. తాడిత పీడిత గుండె గొంతుకై అవినీతి సర్కారును జనబాహుళ్యంలోనే ఎండగట్టారు. ఇందుకూ ఓ నేపథ్యముంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ప్రజావాణి విన్పించే చట్టసభలను మందబలంతో అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. జనం కష్టాలు వినిపించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షం గొంతును అసెంబ్లీ సాక్షిగా నొక్కేసింది. గుండె చెదిరిన సామాన్యుడు నిస్సహాయ స్థితికి చేరాడు. దీంతో దగాపడ్డ వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు, సర్కార్‌ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జనం కన్నీళ్లను దోసిటపట్టిన జననేత ప్రతీ గుండెను హత్తుకున్నారు.  

కసి.. కదలిక.. పరిష్కారం! 
వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో 2017 నవంబరు 6న పాదయాత్ర మొదలైనప్పుడు జగన్‌లో ఓ కసి కనిపించింది. ‘ప్రతీ గడపకూ వెళ్లాలనుంది.. జనం గుండె చప్పుడు వినాలనుంది.. కసిగా ఉన్నాను. ప్రజల కోసమే బతకాలన్న ఆవేశంతో ఉన్నాను’ అని జగన్‌ చెప్పారు. పద్నాలుగు నెలల సుదీర్ఘ పాదయాత్ర అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరువలోకొచ్చిన జననేతలో స్పష్టమైన, పరిపూర్ణమైన మార్పు కన్పిస్తోంది. సమస్యలు వినేందుకే వస్తున్నానని చెప్పిన నేత.. ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. తరలివచ్చిన ప్రజావెల్లువ సాక్షిగా కన్నీళ్లు తుడిచే పథకాలను ప్రకటించారు. దగాపడ్డ రైతన్నకు ఎక్కడికక్కడే భరోసా ఇస్తూ తానొస్తే ఎలా ఆదుకుంటానో చెప్పారు. పెట్టుబడి సాయం ఎలా ఇస్తానో వివరించారు. అప్పులపాలైన అక్కాచెల్లెమ్మల ఆవేదన విన్న జగన్‌.. జనం సాక్షిగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సంక్షేమం అందని పేదవాడి గురించే ఏడాది క్రితం జగన్‌ మాట్లాడేవారు. ఉపాధిలేక ఊరొదిలే యువత ఆవేదనే విపక్ష నేత వాణిలో చూశాం. పాదయాత్రలో ఆ సమస్యకు ఆయన పరిష్కారం చెప్పారు. అధికారంలోకొస్తే ఏటా పోస్టుల భర్తీచేస్తానని, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం తెస్తానన్నారు. ఇల్లులేని పేదల సొంతింటి స్వప్నం జగన్‌ నోటి వెంట వచ్చింది. అభాగ్యుల ఆర్తి తెలుసుకున్న తర్వాత ఆయనిప్పుడు ఆరోగ్యశ్రీని ఎంత విజయవంతంగా అమలుచేయవచ్చో స్పష్టత ఇస్తున్నారు. ప్రతీ సమస్యపై స్పష్టమైన అవగాహనతో సర్కారును నిలదీసే నైజం ఏడాది క్రితం వైఎస్‌ జగన్‌ది. ఇప్పుడు అధికారంలోకొస్తే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తి జగన్‌. 

విలువలే ప్రాణం.. విశ్వసనీయతే ఆయుధం 
‘జగన్‌ ఎన్నో హామీలిచ్చారు. అవన్నీ సాధ్యమా? ఈ మాట అధికారపక్షం కూడా అనలేకపోతోంది’.. పాదయాత్రను నిశితంగా గమనించిన రిటైర్డ్‌ సీనియర్‌ అధికారి అనంతరామారావు అన్న మాటలివి. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అనేకమంది దగ్గర ఇదే ప్రస్తావన తెస్తే వాళ్లు చెప్పిందొకటే.. ‘వాళ్ళ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నాడు. హామీ ఇవ్వకుండానే ఎన్నో చేశాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన బిడ్డపై ఆ మాత్రం నమ్మకముంది’.. అన్న జవాబే వచ్చింది. ఆరంభం నుంచీ ఒంటరిపోరే చేస్తున్న జగన్‌.. కష్టాలెన్నొచ్చినా రాజకీయ ప్రస్థానంలో విశ్వసనీయతకే ప్రాధాన్యమిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు ఎక్కడా తావివ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని రాసిచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తే ఉండదన్నారు. మాటకు కట్టుబడే జగన్‌ నైజం ప్రజలను బాగా ఆకర్షించిందని రాజకీయ వర్గాలూ విశ్లేషిస్తున్నాయి.  

చెదరని గుండె.. చలించే మనస్సు 
విశాఖ విమానాశ్రయంలో హత్యకు కుట్ర జరిగినా జగన్‌ నిబ్బరంగా ఉండటాన్ని ప్రజలు గమనించారు. దాన్నో అవకాశంగా తీసుకుని హడావిడి చేసే రాజకీయ స్వభావం లేకపోవడాన్ని జనం హర్షించారు. రక్తసిక్తమైన దుస్తుల్లోనూ మొక్కవోని గుండె ధైర్యంతో పార్టీ కేడర్‌ను ఆవేశానికి గురికాకుండా చేయడం జగన్‌లో చెప్పుకోదగ్గ లక్షణమనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. నాలుగున్నరేళ్ల ఈ ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీ నేతల ఈసడింపులు, దుర్భాషలు, రెచ్చగొట్టే చర్యలు అనేకం ఎదురయ్యాయి. కానీ, ఎక్కడా తొణకలేదు. పాదయాత్రలో జనం మరింత దగ్గరవ్వడానికి ఇదీ ఓ కారణమనేది రాజకీయ వర్గాల నిశ్చితాభిప్రాయం. ప్రజలు ఈ లక్షణాలన్నీ పాదయాత్ర ద్వారా దగ్గర్నుంచి చూడగలిగారు. ‘అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడేమోగానీ.. జగన్‌ మాత్రం చంద్రబాబు కుయుక్తులను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లార’ని ఓ ఐఏఎస్‌ అధికారి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌ సహా విపక్ష గొంతు నొక్కిన తీరు.. అప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అధికార పార్టీ నైజాన్ని ప్రతీ వ్యక్తి చర్చించే రీతిలో జగన్‌ జనంలోకి తీసుకెళ్లారు. విమర్శలకు ప్రతివిమర్శలే పరిష్కారమనే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో స్థితప్రజ్ఞతతో ఓ నేత జననేతగా గుర్తింపు తెచ్చుకుంటాడని జగన్‌ నిరూపించారు. గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు పక్షాన ఆయన జరిపిన పోరాటాన్ని.. ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో ఆయనను మంచి నేతగా గుర్తింపు తీసుకొచ్చాయని చెబుతున్నారు.  

వ్యక్తి.. శక్తి.. వ్యవస్థ 
జగనే తమ నాయకుడని బలంగా చెబుతున్న జనం ఆయన రాజకీయ విస్తరణను.. ప్రజలపట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ‘ఓ వ్యక్తిగా రాజకీయాల్లోకొచ్చాడు.. వ్యక్తిత్వంతోనే పార్టీని శక్తిగా మార్చాడు.. పాదయాత్ర ద్వారా ఓ వ్యవస్థనే ఏర్పాటుచేశాడు. జగన్‌ అంటేనే జనమన్న నమ్మకం కల్గించాడు. ఏడాదికిపైగా ఎండలో మాడిపోతూనే ప్రజలను నవ్వుతూ పలకరించాడు. వర్షంలో తడిసి ముద్దవుతూనే పేదల బతుకు చిత్రాన్ని దగ్గరుండి పరిశీలించాడు. వణికించే చలిలోనూ ప్రజల గుండె చప్పుడు వినేందుకు వడివడిగా అడుగులేశాడు. జనం లోగిళ్ల ముందే జగన్‌ సంక్రాంతి చేసుకున్నాడు. ప్రజల ఆనందపు వెలుగుల్లోనే దీపావళి జరుపుకున్నాడు. తెలుగు ప్రజల ఆత్మీయతల మధ్యే తెలుగు సంవత్సర వేడుకల్లో పాల్గొన్నాడు. ఇలా పండగేదైనా అన్నీ ప్రజాక్షేత్రంలోనే. ఇవన్నీ జగన్‌ తమ నాయకుడనే భావాన్ని ప్రజల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. జగన్‌ పుట్టినరోజు ప్రజల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే జనం.. రావాలి జగన్‌–కావాలి జగన్‌ అని అంటున్నారు. 

అలసటే ఎరుగని నేత
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్‌ దగ్గర పనిచేయడం, వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన వెన్నంటే ఉండడం, నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే. ఆయనలో ఉన్నంత సహనం, దయాగుణం నేనెక్కడా చూడలేదు. పాదయాత్రలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎన్ని వేలమంది వచ్చి కలుస్తున్నా.. ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఏనాడూ అలసట, చిరాకు, కోపం అనేది ఆయనలో ఎప్పుడూ కనిపించలేదు. పైపెచ్చు నేను ఎప్పుడైనా మా స్టాఫ్‌పట్ల కొంచెం చిరాకుపడితే సార్‌ ఊరుకునే వారు కాదు. ‘అలా కోపం మంచిది కాదు.. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. ప్రశాంతంగా ఉంటే అన్నీ చక్కగా, సాఫీగా జరుగుతాయి’.. అని చెబుతుండే వారు. ఇంటిదగ్గర ఉన్నా.. పాదయాత్రలో ఉన్నా రాత్రి పదకొండు గంటలకు పడుకుని ఉదయం నాలుగు.. నాలుగున్నరకల్లా నిద్రలేవడం సార్‌కు అలవాటు. సమయపాలనలో చాలా ఖచ్చితంగా ఉంటారు. క్రమశిక్షణ పాటిస్తారు. 

వ్యాయామం.. మిత ఆహారం 
ఉదయం లేచాక టీ తాగి ఒక గంటపాటు వ్యాయామం చేస్తారు. అనంతరం స్నానంచేసి వచ్చాక అరగంటపాటు ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక గ్లాసు పళ్లరసం తీసుకుంటారు. అంతే.. టిఫిన్‌ వంటివి ఏవీ చేయరు. ఆ వెంటనే పాదయాత్ర ప్రారంభిస్తారు. మధ్యాహ్నం శిబిరం వచ్చేవరకు ఏమీ పుచ్చుకోకుండానే నడుస్తారు. ఆ తర్వాత ఆపిల్‌ లేదా వేరే ఏదైనా పండు ఒకటి తీసుకుని మజ్జిగ తాగుతారు. అనంతరం అరగంటసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత పార్టీ వారితో మాట్లాడి మళ్లీ పాదయాత్రకు రెడీ అవుతారు. ప్రజా సమస్యల గురించి నిత్యం పార్టీ నాయకులు, ఇతరులతో చర్చిస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం మీద లోతుగా సమాచారం మొత్తం తెప్పించి చదివేవారు. ఏవైనా సందేహాలుంటే మళ్లీ మాతో ఫోన్లు చేయించి వారితో మాట్లాడేవారు. రాత్రి శిబిరానికి చేరుకునే వరకూ మళ్లీ ఎలాంటి ఆహారమూ తీసుకోరు. ఒక్కోసారి మధ్యాహ్నం పూట కూడా ఆగకుండా ఏకధాటిగా రాత్రి శిబిరం వరకు నడుస్తారు. ఇక రాత్రి ఆహారం కింద కేవలం రెండు రకాల కాయగూరలతో చేసిన కర్రీ, ఒక పుల్కా, తీసుకుంటారు. మాంసాహారం అసలు ముట్టుకోరు.  

ఆ పాదయాత్ర మిస్సయినా.. 
గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సార్‌ దగ్గర పనిచేస్తూ ఆయన పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి జగన్‌ సార్‌ దగ్గరకు వచ్చేశాను. అప్పుడు పాల్గొనలేకపోయినా ఈ పాదయాత్రలో నేను సార్‌తో పాటు ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. కానీ, ఈరోజే (మంగళవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. ఇప్పుడు యాత్ర ముగింపు సమయంలో నేను లేకపోవడం చాలా బాధగా ఉంది. విశాఖలో సార్‌పై కత్తితో దాడి జరిగినప్పుడు నేను చాలా భయపడ్డా.  
– నారాయణ (వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత సహాయకుడు)  

సొంత మనిషిలా చూసుకుంటారు 
గతంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు పాదయాత్రగా వెళ్లినప్పుడు నేనూ ఆయనతో పాటు నడిచాను. కానీ, ఈసారి వద్దన్నారు. వయసు మీదపడ్డాక ఇప్పుడెందుకు నడుస్తావ్‌ అని అన్నారు. పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో రెండుసార్లు నేను అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో ఒకసారి హైదరాబాద్‌కు విమానంలో పంపించారు. ‘నారాయణ నాకు కావల్సిన వ్యక్తి.. ఆయనకు ఏ ఇబ్బంది రాకూడదు. అన్నీ దగ్గరుండి చూసుకోండి’ అని ఆస్పత్రి వారికి చెప్పి మరీ వైద్యం చేయించారు. ఇంత జాగ్రత్తగా ఆయన తన సహాయకులను చూసుకుంటారు. దాదాపుగా 36 ఏళ్లుగా ఆ కుటుంబంలోనే నేను పనిచేస్తున్నాను. పదహారేళ్లుగా జగన్‌ సార్‌తో ఉంటున్నాను. నన్ను ఏనాడూ ఒక ఉద్యోగిగా చూడలేదు. ఇంటిలోని సొంత మనిషిగా చూసుకుంటున్నారు.  

పేదోడికి ధీమా.. అందరికీ భరోసా 
అన్ని వర్గాలకు అనువైన హామీలు ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఈ హామీలు ఇచ్చాను. వీటిని నేరవేర్చలేక పోతే తప్పుకుంటాను.
– వైఎస్‌ జగన్‌

‘చేయగలిగినవే చేస్తాను.. చేసేవే చెబుతాను’ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి సందర్భంలోనూ అనేమాటిది. ఏడాదికిపైగా సాగిన ప్రజాసంకల్ప యాత్రలో ఆయన ప్రజల కష్టాలెన్నో తెలుసుకున్నారు. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేశారు. జనామోదం పొందిన నవరత్నాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజల్లో భవిష్యత్‌ పట్ల ఆశను కల్పించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారతాయనే భరోసానిచ్చారు. ఆయన అధికారంలోకొస్తే నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ.లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం వచ్చింది. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో బక్కచిక్కి శల్యమైన రైతుల కన్నీటి కథలు.. నిరుద్యోగుల వెతలు... అక్కచెల్లెమ్మల కన్నీటి గాథలు ప్రతిపక్ష నేతను కదిలించాయి. బతుకు భరోసా లేని అవ్వాతాతలు, ఆరోగ్యశ్రీ వర్తించక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అనేకమంది వైఎస్‌ జగన్‌ను కలుసుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు ఒకరేమిటి మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష నేత అడుగులో అడుగులేశారు.

అథ:పాతాళంలో అభివృద్ధి
రాష్ట్రం ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధిలో అథ:పాతాళంలో నిలిచింది. ఏ ఒక్క వర్గమూ టీడీపీ పాలనలో సంతోషంగా లేదు. రాజధానికని ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం దగ్గర నుంచి రైతు రుణాల మాఫీ వరకు, విద్యార్థులకు ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడం నుంచి నిరుద్యోగులకు భృతి అందివ్వకపోవడం వరకు ఎక్కడా ఆయా వర్గాల అభివృద్ధి జాడే లేదు.  రాజధానిలో సింగపూర్‌ నిర్మాణాలని ఒకసారి, జపాన్‌ నిర్మాణాలని మరోసారి ప్రజలను మోసం చేయడం, వారికి రోజుకో సినిమా చూపడం తప్ప శాశ్వత భవనాలకు ఒక్క ఇటుకా పడలేదు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మహిళలను నిండా ముంచారు. అలాగే వాడవాడలా బెల్టుషాపులకు గేట్లు ఎత్తి కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. ఇలా ఎవరికీ సంతోషం లేకుండా, అభివృద్ధి అనేది లేకుండా టీడీపీ పాలన సాగింది. 

అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇచ్చిన ప్రతిపక్ష నేత
టీడీపీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన అన్ని వర్గాలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్న పథకాలు వారికి భవిష్యత్‌ పట్ల భరోసాను కల్పించాయి. చిన్నారులను బడికి పంపించే తల్లుల కోసం ప్రకటించిన అమ్మఒడి పథకంతో చిన్నారులంతా బడిబాట పడతారు. అదేవిధంగా చదువుకునేవారికి ఎంత ఫీజైనా చెల్లిస్తామంటూ ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం విద్యార్థుల ఉన్నతవిద్య ఆశలను సాకారం చేస్తుంది. ఉన్నత విద్య పూర్తి చేసుకోగానే ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్‌ ప్రకటించడంతోపాటు ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగ సమస్యను రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించవచ్చు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వలసలు తగ్గిపోతాయి. ఇక తాగునీరు అందక, పంటలు పండక, గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కాంతిరేఖగా నిలుస్తుంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం ప్రకటించిన వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళల అభివృద్ధి సాధ్యమవుతుంది.  అధికారంలోకి రావడానికి కాకుండా ప్రజాసంకల్పయాత్రలో ఎంతోమంది బాధితుల సమస్యలు విన్నాక.. వారి బాధలు చూశాక.. ఎంతో అధ్యయనం చేశాక ఆయా వర్గాల అభివృద్ధికి ఈ పథకాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీలు నెరవేర్చలేకపోతే ఏకంగా పదవి నుంచే తప్పుకుంటానని వైఎస్‌ జగన్‌ చెప్పడం ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి చూపాలనే దృఢసంకల్పానికి నిదర్శనం.

నవరత్నాలతో పాటు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లో మరికొన్ని..
- మూతపడ్డ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపిస్తారు.  
అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.  
ముస్లిం మైనార్టీలను ఆదుకునేందుకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, భూముల పంపిణీ. 
దాదాపు అన్ని సామాజికవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు.
ఏటా మెగా డీఎస్సీ నిర్వహణతోపాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీ
ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌
ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు. పది మందికి ఉద్యోగాలు.  
- ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం.
దుల్హన్‌ పథకం కింద ఇచ్చే రూ.50 వేల మొత్తం రూ.లక్షకు పెంపు. 
ఇమామ్‌లకు ప్రతినెలా రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం.
గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకునేలా విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు రూ.7.35 నుంచి రూ.3.75కు తగ్గింపు.
నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌. ప్రధాన ఆలయాల్లో కనీస వేతనంపై పనిచేసే అవకాశంతోపాటు ఎమ్మెల్సీ స్థానం. 
గిరిజనులకు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అడ్వైజరీ కౌన్సిల్‌ ఏర్పాటు.  
మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్‌పై 50 శాతం సబ్సిడీ, వేట సమయంలో చనిపోతే మూడు నెలల్లో రూ. 10 లక్షలు అందేలా చర్యలు, ప్రత్యేక కార్పొరేషన్‌.

పాదయాత్రతో మారిన ప్రజా నాడి
ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ.. వారిలో ధైర్యం నింపుతూ.. భవిష్యత్‌పై భరోసా ఇస్తూ వేలాది కిలోమీటర్ల మేర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సాగించిన ప్రజా సంకల్ప యాత్రతో జనం నాడి మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ గోడు వినేందుకు వచ్చిన జగన్‌ వెంట నిరుపేదలు, అణగారిన వర్గాలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు యువత, ఉద్యోగులు ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాలు పాదం కదపడమే ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. జగన్‌ అడుగుపెట్టిన ప్రతి ప్రాంతానికి తండోపతండాలుగా తరలివచ్చి తమ అభిమానం చాటుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని వారు భావిస్తుండటం వల్లే ఈ ప్రజాదారణని పేర్కొంటున్నారు. వైఎస్సార్‌ అస్తమయం, రాష్ట్ర విభజన తర్వాత సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు జగన్‌ ఆశాదీపంలా కనిపించారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి బయటకు వచ్చి వైఎస్సార్‌సీపీని స్థాపించినప్పుడు.. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జైలు పాలుచేసినప్పుడు కూడా జనం ఆయన్ని వదల్లేదన్నారు. అయితే అనుభవంతో పాటు రుణమాఫీ వంటి 600 హామీలతో గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. లేకపోతే 2014లోనే జగన్‌ సీఎం అయ్యేవారని గుర్తు చేస్తున్నారు.

ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ సరిగ్గా నెరవేర్చకపోగా.. అవినీతి, అక్రమాలు పెరిగిపోవడం, జన్మభూమి కమిటీల లంచావతారం.. టీడీపీ నేతల అరాచకాలతో ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని వివరించారు. ఈ సమయంలో జగన్‌ పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ.. వాటిపై సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా అశేష అభిమానాన్ని చూరగొన్నారని వివరించారు. పాదయాత్రలో ఉన్నప్పటికీ తన పార్టీ నాయకులకు, కేడర్‌కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ పోరాటాలు చేయించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలకు ఒక స్పష్టత వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వారు వచ్చారన్నారు. ధన బలం, కండబలం, అధికార బలంతో పాటు పోల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా తిమ్మిని బమ్మిని చేయొచ్చనుకుంటున్న టీడీపీ నేతల ఆటలు సాగే పరిస్థితి కనపడం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు