కోటా బిల్లులో ఏముంది?

9 Jan, 2019 04:42 IST|Sakshi

ఉద్దేశాలు, కారణాలను బిల్లులో వివరించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఈ 10 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే 124వ రాజ్యాంగ సవరణ చట్టంగా పేర్కొంటారు.  అధికరణ–15లోని నిబంధన(5) తరువాత నిబంధన (6)ను చేర్చుతారు. నిబంధన (6) ప్రకారం ఈ అధికరణలోని ఏ నిబంధన గానీ, అధికరణ–19లోని నిబంధన (1)లోని ఉప నిబంధన(జి) గానీ, అధికరణ–29లోని నిబంధన(2) గానీ రాజ్యం(ప్రభుత్వం) ఎ)ఆర్థికంగా వెనకబడిన వర్గాల(నిబంధన–4, నిబంధన–5లో ప్రస్తావించినవి కాకుండా) పురోగతికి  ఏదైనా ప్రత్యేక నిబంధన రూపొందించడంలో గానీ ;  బి) ఏదైనా ఆర్థిక వెనకబాటు వర్గాల(నిబంధన–4, నిబంధన–5లో ప్రస్తావించినవి కాకుండా) పురోగతికి వీలుగా ప్రయివేటు, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌ సహా విద్యా సంస్థల్లో.. ప్రస్తుత రిజర్వేషన్లకు అదనంగా గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఏదేనీ ప్రత్యేక నిబంధన రూపొందించడంలో గానీ నిరోధించజాలదు.  అధికరణ–16లోని నిబంధన (5) తరువాత నిబంధన (6) చేర్చుతారు. నిబంధన (6) ఇలా  ‘ప్రస్తుతం ఉనికిలో ఉన్న రిజర్వేషన్లకు అదనంగా.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో గరిష్టంగా పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా రాజ్యం(ప్రభుత్వం) ఏదైనా ప్రత్యేక నిబంధన రూపొందించడాన్ని ఈ అధికరణలోని ఏ భాగమూ నిరోధించజాలదు..’   

బిల్లు ఉద్దేశాలు; కారణాలు 
ప్రస్తుతం ఆర్థికంగా వెనకబడిన వర్గాల పౌరుల్లో అధిక భాగం ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు దూరంగా మిగిలిపోయారు. ఆర్థిక వెనకబాటుతనం కారణంగా ఆర్థికంగా పుష్టి కలిగిన వారితో పోటీపడలేకపోతుం డటమే ఇందుకు కారణం. భారత రాజ్యాంగ అధికరణ 15లోని నిబంధన (4), నిబంధన (5), అధికరణ 16లోని నిబంధన (4) ద్వారా ప్రస్తుతం ఉనికిలో ఉన్న రిజర్వేషన్‌ ప్రయోజనాలు.. సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు తదితర నిర్ధిష్ట ప్రాతిపదిక గల వారికి తప్పితే ఈ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అందుబాటులో లేవు.  బలహీన వర్గాలు, నిర్ధిష్టంగా చెప్పాలంటే.. ఎస్సీ, ఎస్టీ ప్రజల విద్యా, ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు, సామాజికంగా అన్యాయానికి, ఏరకమైన దోపిడీకి వీరు గురికాకుండా రక్షించేందుకు వీలుగా ప్రత్యేక శ్రద్ధ చూపేందుకుగాను ప్రభుత్వానికి రాజ్యాంగంలోని 46వ అధికరణలోని ఆదేశిక సూత్రాలు అధికారాన్ని కల్పించాయి. 

అధికరణ –15లో 93వ రాజ్యాంగ సవరణ చట్టం–2005 ద్వారా నిబంధన (5)ను చేర్చారు. దీని ద్వారా సంక్రమించిన అధికారంతో ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల పౌరులకు, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు, ఉన్నత విద్యలో ప్రవేశాలకు సంబంధించి వారికి చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక నిబంధన రూపొందించేందుకు వీలు కలిగింది.  అదే తీరుగా అధికరణ–16లో నిబంధన (4)ను చేర్చింది. దీని ద్వారా సంక్రమించించిన అధికారంతో ప్రభుత్వం ఏదేని వెనకబడిన తరగతులకు ఉద్యోగ రంగంలో తగిన ప్రాతినిథ్యం లేదని  ప్రభుత్వం అభిప్రాయపడినప్పుడు, వారికి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక నిబంధన ఏర్పాటు చేయవచ్చు.

 అయినా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందుకునేందుకు అర్హత లేదు. 46వ అధికరణలోని ఆదేశాలను పూర్తి చేయడానికి, ఆర్థికంగా వెనకబాటుకు గురైన వర్గాలకు ఉన్నత విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయమైన వాటా పొందేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించడమైంది. ఆర్థికంగా వెనకబాటుకు గురైన వర్గాలకు ఉన్నత విద్యాసంస్థల (ప్రైవేటు విద్యా సంస్థలు, ఎయిడెడ్‌/అన్‌ ఎయిడెడ్‌ సహా, అధికరణ–30లో ప్రస్తావించినట్టుగా మైనారిటీ విద్యా సంస్థలు మినహాయించి)లో కోటా కల్పించేందుకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు–2019 ఉపయోపడుతుంది.  ఈ ప్రయోజనాలన్నీ సాధించేందుకే ఈ బిల్లు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా