ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి

24 May, 2019 18:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌... ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని ప్రతినబూనారు. ఎగ్జిట్‌ పోల్స్‌ సందర్భంగా ఏపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు..సైకిల్‌ విజయం తథ్యం అంటూ బీరాలు పలికిన ఆయనకు ఫలితాల అనంతరం దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఫ్యాన్‌ ప్రభంజనంతో సైకిల్‌ కొట్టుకుపోవడంతో ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి అభాసుపాలయ్యారు. 

ఫలితాల అనంతరం మీడియా ముందుకు వస్తానని బీరాలు పలికిన లగడపాటి...ఫ్యాన్‌ ఫుల్‌ స్పీడ్‌కి మొహం చాటేసి...చివరకు ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నానంటూ అధికారికంగా ఓ లేఖ విడుదల చేశారు. కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల నాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలం అయినందుకు ఇక భవిష్యత్‌లో సర్వేలకు దూరంగా ఉండదలచుకుంటున్నట్లు చెప్పారు. 

తన ఫలితాల వలన ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే మన్నించాలంటూ లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పాలంటూ లగడపాటి ఆకాంక్షించారు.

చదవండి:
బాబు కోసం బోగస్‌ సర్వేలు
సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి
విదూషకుల విన్యాసాలు

మరిన్ని వార్తలు