అప్పుడు ప్రజ్ఞా.. ఇప్పుడు నిధి

3 Jun, 2019 04:27 IST|Sakshi
నిధి చౌదరి

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

అనంతరం తాను అవమానించలేదంటూ వివరణ

ముంబై: జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సేనే నిజమైన దేశ భక్తుడని ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలు మరిచిపోకముందే.. ముంబైలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్‌ అధికారిణి గాంధీపై అనుచితంగా ట్వీట్‌ చేశారు. వివరాలు.. బీఎంసీ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నిధి చౌదరి.. ‘మహాత్మాగాంధీ ముఖచిత్రాన్ని భారత కరెన్సీపై తొలగించాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను, పలు సంస్థలు, రోడ్లకు పెట్టిన గాంధీ పేరును మార్పు చేయాలి. థ్యాంక్యూ గాడ్సే’అంటూ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో గాంధీపై చేసిన ట్వీట్‌ను ఆమె డిలీట్‌ చేశారు.

గాంధీపై వివాదాస్పద ట్వీట్‌ చేసిన నిధి చౌదరీని వెంటనే సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ చవాన్, ఎన్సీపీ నేత జితేంద్ర డిమాండ్‌ చేశారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమె తన ట్వీటును తొలగించారు. ‘గాంధీని నేను అవమానించ లేదు. గాంధీ జాతిపిత. నేను వ్యంగ్యంగా చేసిన ట్వీటును తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని మరో ట్వీటులో ఆమె చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ గాంధీజీని అవమానించలేదు. వ్యంగ్యంగా రాసిన పోస్టును అపార్థం చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో గాంధీపై వ్యతిరేక, తప్పుడు వ్యాఖ్యానాలు అనేకమంది చేస్తున్నారు. ఈ వ్యతిరేక వ్యాఖ్యలను గాంధీ చూడకపోవడమే మంచిదని భావించి గాడ్సేకు ధన్యవాదాలు చెప్పానని నిధి తెలిపారు.

మరిన్ని వార్తలు