అధికార మార్పు అవసరం: సాయిరాం శంకర్‌

10 Apr, 2019 10:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : ‘ప్రజలు పది కాలాలపాటు గుర్తుంచుకునే పథకాలు అమలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే.. ఆయన వారసుడితోనే అది సాధ్యం. అందుకోసం మార్పు అనివార్యం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు, ముఖ్యంగా యువజనం మార్పుకోసం గళమెత్తుతోంది. దమ్ము, ధైర్యం, విజన్‌ ఉన్న యువ నాయకుడు వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని యువత కోరుకుంటున్నారు. జరగబోయేది కూడా అదే’ అంటున్నారు వర్థమాన హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌. సాక్షి ఇంటర్వ్యూలో సాయిరాం మనోభావాలు.. ఆయన మాటల్లోనే...

జనం గుండెల్లో వైఎస్‌ 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ లోకంలో లేకపోయినా.. ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారంటే ఆయన ప్రవేశపెట్టిన 108, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ వంటి ప్రజా పథకాలే అందుకు కారణం. ఆ పథకాలతోనే ఆయన ప్రజల మనసుల్లో చిరకాలం నిలిచిపోతున్నారు. ఆరోగ్యశ్రీ ప్రభావం అంతాఇంతా కాదు.  మా సొంత ఊరు ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ చాలామంది జీవితాలను నిలిపింది. జగన్‌ సీఎం అయితే ఆ పథకాలన్నీ మళ్లీ పక్కాగా అమలుచేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. జగనే చేయగలరు. తన తండ్రికున్న మంచి పేరు ఎలాగైనా నిలబెట్టాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. అందుకే జగన్‌పై ప్రజలకు నమ్మకం. 

యువనేత జగనే సీఎం : 
ఓట్‌ ఫర్‌ చేంజ్‌.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జనమంతా అదే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని అన్నిచోట్ల యువత ఎదురు చూస్తోంది. ఇప్పటివరకూ సీనియర్‌ను చూశారు. ఈసారి యువ నేత జగన్‌కు అవకాశం ఇచ్చి పరిపాలనలో మార్పు చూడాలని.. నేనేకాదు, జనమంతా కోరుకుంటున్నారు.  కొత్త రాష్ట్రానికి కొత్త నాయకత్వం రావాలని యూత్‌ కోరుకుంటోంది. జగన్‌కు ఒక అవకాశం ఇద్దామని అందరికీ బలంగా ఉంది. అదే జరగాలి. జరుగుతుందని నా ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోæ యువకుల పట్టుదల చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తోంది. ఎంతోమంది జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కష్టపడి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వారిలో నేను కూడా ఒకడిని! 

జనాలకు చేరువైన యువనేత
పాదయాత్ర ఆయనను జననేతగా చేసింది. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేయడమంటే మామూలు విషయంకాదు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి కంటే ఎక్కువ దూరం ఇది.  ఒక రాజకీయ నాయకుడు జనంతో కలిసి అన్ని కిలోమీటర్లు నడుస్తారని మనమెవరూ ఊహించను కూడా ఊహించి ఉండం. హామీలు కచ్చితంగా అమలు చేస్తారు. గత ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఒక్క మాట చెప్పి ఉంటే.. అప్పుడే జగన్‌ సీఎం అయ్యేవారు. అప్పుడున్న పరిస్థితిల్లో ఇవ్వలేననుకునే ఆయన హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తానన్న నమ్మకంతోనే చెబుతున్నారు. జగన్‌ హామీలను జనం నమ్ముతున్నారు. ప్రజలు అవకాశం ఇస్తే.. వైఎస్‌ లాగ సంక్షేమ పాలన, జనరంజక పాలన జగన్‌ అందించగలరని నమ్ముతున్నా. ఆయన వేగం, విజన్‌ చూస్తుంటే ప్రజా పథకాల అమలులో వైఎస్‌ను కూడా మించిపోతారనిపిస్తోంది.  

సినిమా పరిశ్రమ అభివృద్దికి 
ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తగినంతగా లేవు. ఇండస్ట్రీ అభివృద్ధిపై శ్రద్ధలేదు. చిన్ని సినిమాలకు ఇటీవలే కొన్ని రాయితీలు ప్రకటించారు. అవి కూడా ఆశించినంతగాలేవు. ప్రస్తుత రాయితీలు ఇంకా పెంచితే బాగుండేది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ షూటింగ్‌లను ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి బాట పడుతుంది. 

అందరూ ఓటేయండి 
ఓటుహక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దాన్ని అందరూ తప్పకుండా వినియోగించుకోవాలి. ప్రలోభాలకు లొంగి ఓటేస్తే తరువాత మనమే నష్టపోవాల్సి ఉంటుంది. అభివృద్ధి, ప్రజాశ్రేయస్సుకోసం ఎవరు పాటుపడతారో వాళ్లకే నిర్భయంగా ఓటు వేయండి. ఈసారి మార్పు కోసం ఓటేయండి!! 

ప్రత్యేక హోదా కోసం పోరాడేది జగనే 
కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా రాలేదు. తెచ్చుకోలేకపోయాం. దాన్ని చంద్రబాబు వదిలేశారు. కేంద్రం ఇస్తానన్నది సాధించలేక పోతే అది వైఫల్యమే కదా! మళ్లీ ఈమధ్య మొదలు పెట్టారు. ఇదంతా సోషల్‌ మీడియాలో షికారు చేస్తోంది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్‌ మొదటినుంచి ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలంతా రాజీనామా చేసింది ప్రత్యేక హోదా కోసమే కదా! దీన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దాని ఫలితం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చూపిస్తారు.  

మరిన్ని వార్తలు