రంగీలా తారని కాదు.. రాజకీయ నేతను

13 Apr, 2019 07:08 IST|Sakshi

సామాజిక బాధ్యతతో ప్రజల ముందుకొస్తున్నా..‘పీటీఐ’తో ఊర్మిళ 

90వ దశకంలో హిందీ, తెలుగు చిత్రాలలో నటించిన ‘రంగీలా’ సుందరి ఊర్మిళా మటోండ్కర్‌ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అయితే నాటి తారగా కాకుండా ప్రజల ప్రతినిధిగానే ఈ ఎన్నికల్లో నిలబడుతున్నానంటోది ఊర్మిళ. ‘నాకున్న స్టార్‌ ఇమేజ్‌తో నేను ప్రజల వద్దకు వెళ్లట్లేదు. పూర్తిగా ప్రజల గురించి తెలుసుకుని వారికి దగ్గరవుతాను. ఇదంతా సులవు కాదని తెలు’సం టూ తన రాజకీయ అరంగేట్రంలో సవాళ్లను గురించి పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఊర్మిళ ఈ ప్రాంతంలో తిరుగుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇళ్లు, నీటి కొరత, మురుగు పారిశుధ్య సమస్యలున్నాయని ఆమె తెలిపారు. ఈ సమస్యలకి ఒక్క రాత్రిలో పరిష్కారం చూపటం సాధ్యం కాదు. చాలా మంది ప్రజలు పబ్లిక్‌ టాయిలెట్స్‌ కావాలని, గోరాయి ప్రాంతంలో నీళ్ల సమస్య గురించి చెబుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, లోకల్‌ ట్రెయిన్స్, కనీస వసతులు పెంచాలని తాను తెలుసుకున్నానని ఆమె చెబుతున్నారు.

వాడిగా వేడిగా..
రాజకీయాలంటే మాట ఇవ్వటం, ఏదేమై నా ఆ మాటకు కట్టుబడటం అని గట్టిగా చెబుతున్నారు ఊర్మిళ. బీజీపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టితో ఆమె పోటీ పడనున్నారు. రాజకీయ అనుభవం ఉన్న ఆయన,  ఊర్మిళకు రాజకీయం జ్ఞానం సున్నా అని విమర్శించారు. ఆమె ఈ మాటలేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. కానీ ఆయన తీరును మాత్రం ఆమె బాగా అర్థం చేసుకున్నారు. ‘‘ఆయన మాటలను బట్టి ఆయన తీరు అర్థమవుతోంది. ఆయన నా గురించి హేళనగా, తప్పుగా మాట్లాడుతున్నారు. దీని వెనుక రెండు విషయాలు ఉండవచ్చు. ఆయనకు తన మీద విశ్వాసం తగ్గిపోవటం, లేదా లోపల దాగి ఉన్న భయాలన్నీ ఈ రూపంలో బయటకు వస్తుండవచ్చు. ఆయన, ఆయన పార్టీ వాళ్లు ఎక్కువగా ఆవేశపూరిత వాతావరణంలోకి అవతల వాళ్లని నెట్టాలని ప్రయత్నిస్తుంటారు. మతాత్మక, సామాజిక–ఆర్థిక అంశాలతో ప్రజలను బిజీగా ఉంచుతారు. దీని వల్ల ప్రజలు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టరు. అలాంటప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?’’ అని ప్రశ్నించారు ఊర్మిళ. ఒకవేళ అలాంటి రాజకీయాలు నాకు తెలియవని ఆయన అంటే, అలాంటి రాజకీయాల్లో నేను జీరోగా ఉండటమే తనకు సంతోషం అని అన్నారామె.
 
సమాజానికి ఏమైనా చేయాలని..
45 ఏళ్ల ఊర్మిళ చివరిసారిగా బ్లాక్‌ మెయిల్‌ చిత్రంలో నటించారు. ఇకపై సమాజానికి ఏమైనా చెయ్యాలి అని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకోలేదని, ఏదైనా పార్టీలో చేరి వారి కోసం ప్రచారం చెయ్యాలనుకున్నానని తెలిపారు. కానీ పార్టీలో చేరిన తర్వాత, బెస్ట్‌ అందించాలి అందుకే ఈ పోటీకి సిద్ధమయ్యానన్నారు. 

అసాధారణ ప్రధాని కాగలరు..
చిన్నప్పటి నుంచి సామాజిక బాధ్యతతో పెరిగానని, స్త్రీల సమస్యలు, బాలల విద్య, ఎయిడ్స్‌ అవగాహన లాంటి అంశాలపై ఆమె పనిచేశానన్నారు. ప్రధాని అభ్యర్థి  అయిన రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడుతూ ఆయన దేశానికి అసాధారణ ప్రధాని కాగలడని అన్నారు. ఆయనను అపోజిషన్‌ వాళ్లు నిరంతరం ట్రోల్‌ చేస్తూ, విమర్శిస్తూ చులకన చేస్తు వస్తూన్నారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఈ ఐదేళ్లు విరామం లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. దాని ప్రతిఫలమే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో. ఆయన అధికారంలోకి వస్తే వాటిని సమర్థవంతంగా అమలు చెయ్యగలరు. 

సినిమాలు లేవు.. సవాళ్లే...
తాను పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించనున్నట్టు ఊర్మిళ తెలిపారు. ప్రస్తుతం తాను ఏ చిత్రాలు చెయ్యటం లేదని చెప్పారు. సినిమా వాళ్లకీ సాధారణ ప్రజలకుండే కష్టాలున్నాయన్నారు. మన మాట్లాడే స్వేచ్ఛ హరించుకు పోవటం చాలా ప్రమాదకరమని అమె అన్నారు. అదే మీడియా, సినిమా పరిశ్రమ, సాధారణ ప్రజలు కూడా దీనిని ఎదుర్కుంటున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు