తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే

14 May, 2019 04:33 IST|Sakshi

సినీనటుడు కమల్‌హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు  

సాక్షి, చెన్నై/అరవకురిచ్చి: భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడే అని సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారంలో కమల్‌ మాట్లాడారు. ‘స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథూరాం గాడ్సే’ అని అన్నారు. అతనితోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా కమల్‌ అభివర్ణించుకున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. మహాత్ముని విగ్రహం ముందు నిల్చుని మాట్లాడుతున్నానని అన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తానూ ఒకడినన్నారు. జాతీయ జెండాలోని 3 రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీకలని, ఇవి ఎప్పటికీ చెక్కుచెదరవన్నారు.  

ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ..
కమల్‌ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘంను బీజేపీ కోరింది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్‌ విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిలిసాయి సౌందర్యరాజన్‌ ఆరోపించారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో ఉన్నారు కాబట్టే కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ సైతం కమల్‌ వ్యాఖ్యలను ఖండించారు. కళకు, ఉగ్రవాదానికి మతం ఉండదని తెలుపుతూ వివేక్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. గాడ్సేని తీవ్రవాదిగా పోలిస్తే సరిపోయేదని.. అతని మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.  

ఏకీభవించిన నేతలు..  
కమల్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్, ద్రవిడార్‌ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి. గాడ్సేకి ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి వ్యాఖ్యానించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి కూడా కమల్‌ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ బెయిల్‌పై బయట ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు