ప్రపంచ శక్తిగా భారత్‌

27 May, 2019 04:22 IST|Sakshi
తల్లి హీరాబెన్‌ ఆశీర్వాదం తీసుకుంటున్న మోదీ

రాబోయే ఐదేళ్లు దేశానికి అత్యంత కీలకం

అదృష్టవశాత్తూ ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు: మోదీ

అహ్మదాబాద్‌: భారత్‌ ప్రపంచశక్తుల్లో ఒకటిగా నిలిచేందుకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని జేపీ చౌక్‌ దగ్గర నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘భారత చరిత్రలో 1942–47 మధ్యకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్‌ను ప్రపంచశక్తిగా నిలబెట్టేందుకు రాబోయే ఐదేళ్లు అంతే ముఖ్యమైనవి.’ అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అయినా, వినమ్రంగా ఉండాలని హితబోధ చేశారు.

నన్ను వేళాకోళం చేశారు..
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పండితులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయని మోదీ అన్నారు. ‘ఆరో విడత ఎన్నికల చ్రారంలో భాగంగా ఎన్డీయేకు 300కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని నేను చెప్పగానే చాలామంది వేళాకోళం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీచేయడం లేదు.. ప్రజలే పోటీ చేస్తున్నారు అని నేను చెప్పాను. బీజేపీని మరోసారి అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన గుజరాత్‌ ప్రజలకు కృతజ్ఞతలు’ అని మోదీ వెల్లడించారు. గుజరాత్‌ పర్యటనలో భాగంగా తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సూరత్‌ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు చనిపోవడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రథయాత్రలకూ ఇబ్బంది పడ్డారు: అమిత్‌ షా
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ, రాష్ట్రంలో గూండాయిజాన్ని, అవినీతిని అంతమొందించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. ‘ప్రజలు నరేంద్ర భాయ్‌ను అమితంగా అభిమానించడానికి ఓ కారణం ఉంది. ఆయన చాలాగ్రామాల్లో పర్యటించారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గుజరాత్‌ను బీజేపీకి కంచుకోటగా తీర్చిదిద్దారు’ అని షా ప్రశంసించారు.

మరిన్ని వార్తలు