‘గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌లో చేరాలి’

21 Jan, 2018 13:19 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ చేసిన వ్యాఖ్యలపై టీసీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు ఏజెంట్‌లా మాట్లాడారని ఫైర్‌ అయ్యారు.

రాజకీయ భిక్ష కోసమే గవర్నర్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలను తెలుసుకోకుండా గవర్నర్‌ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజకీయాల పట్ల ఆసక్తి, కేసీఆర్‌పై విశ్వాసం ఉంటే గవర్నర్‌ నరసింహన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని అన్నారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి నరసింహన్‌ చేసిన వ్యాఖ్యలు గవర్నర్‌ హోదాను కించపరిచేలా ఉన్నాయని అన్నారు.

గవర్నర్‌ ఏమన్నారంటే..
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అది చూసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావా..? కలల చంద్రశేఖర్‌ రావా..? అనిపించింది. ఇప్పుడు ప్రాజెక్టు చూశాక అభిప్రాయం మారింది. కేసీఆర్‌.. కాళేశ్వరం చంద్రశేఖర్‌రావుగా మారిపోయారనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు న భూతో న భవిష్యత్‌లా తయారవుతోంది. మంత్రి హరీశ్‌రావు పేరును కూడా కాళేశ్వర్‌రావుగా చరిత్రకెక్కుతుంది’  అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు