అమరావతిలో ఏదో తప్పు జరుగుతోంది..!

22 Apr, 2018 20:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ నూతన రాజధాని అమరావతి విషయంలో ఏదో తప్పు జరుగుతోందని రాష్ట్ర ప్రజలకు తెలుసునని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. కానీ, నిజాలు బయటకు తెలియడం లేదన్నారు. అందుకే రాజధాని నిర్మాణంలో అవకతవకలపై పుస్తకం రాసినట్టు ఆయన తెలిపారు. ఐవైఆర్‌ రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం నగరంలోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సందర్భంగా ఐవైఆర్‌ మాట్లాడుతూ.. ప్రతిసారి రియల్‌ ఎస్టేట్‌లో తగ్గుదల చూపినప్పుడు ప్రభుత్వం సింగపూర్‌, రష్యా అంటూ ఊదరగొట్టిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ వైవిధ్యముందని, అది తెలుసుకొని రాష్ట్రాన్ని పాలించాలని సూచించారు.

అందరినీ కలుపుకొనిపోయే ప్రభుత్వం లేకపోవడమే లోపమని టీడీపీ సర్కారును తప్పుబట్టారు. జన్మభూమి కమిటీలు కూడా ఏకపక్ష ధోరణిలో ఉన్నాయని విమర్శించారు. సైబరాబాద్‌ అనేది హైదరాబాద్‌లో సక్సెస్‌ అయింది.. అమరావతిలో సక్సెస్‌ కాదు.. అది ప్రజలను మభ్యపెట్టడమే అని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో హైప్‌ క్రియేట్‌ చేసి.. ప్రభుత్వం దాన్ని నిర్మించకుండా పక్కన పెట్టేసిందని తప్పుబట్టారు.

మచిలీపట్నం పోర్టులోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, పారిశ్రామికవేత్తల అవసరాల కోసం ఆలోచిస్తూ.. అసలు ప్రాజెక్టులను ప్రభుత్వం పక్కన పెట్టేసిందని అన్నారు. ప్రతిదీ పెద్ద ఎత్తులో చేస్తున్నట్టు ప్రజలను మభ్యపెడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం చివరికీ ఏమీ చేయడం లేదని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు