‘జేసీ బ్రదర్స్‌ మమ్మల్ని చంపేస్తారేమో!’

3 Jul, 2018 13:16 IST|Sakshi

జగ్గీ బ్రదర్స్‌ ఆరోపణ

సాక్షి, అనంతపురం: టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్‌(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్‌ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.  దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉంది. జేసీ ఫ్యామిలీ నుంచి మా ఇద్దరికీ రక్షణ కల్పించాలంటూ చంద్రబాబు గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌కు లేఖ కూడా రాశారు. మాకు ఏ హాని జరిగినా జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి కొడుకులే కారణం. ఇకపై జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యంగా కృషిచేస్తాం’ అని జగ్గీ బ్రదర్స్‌ పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్‌ జూన్‌ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు  తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్‌  నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 

(పూర్తి కథనం.. తాడిపత్రిలో టీడీపీకి షాక్‌)

మరిన్ని వార్తలు