ముందస్తు ఎందుకో ప్రజలకు చెప్పాలి

17 Aug, 2018 02:22 IST|Sakshi

     సీఎం కేసీఆర్‌ను నిలదీసిన జానా 

     లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలైతే ఓకే 

     లేదంటే ప్రజాధనం వృథా అవుతుందన్న కాంగ్రెస్‌ నేత

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి అన్ని పార్టీలూ సిద్ధంగా ఉంటాయని, అలాగే తామూ సిద్ధమని.. కానీ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు తీర్పిస్తే ముందుగానే ఎందుకు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందో వివరించాలని నిలదీశారు. ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారనే ముందస్తుకు వెళుతున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ముందస్తుకు వెళ్లినా లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగానే ఉంటుంది కానీ రెండింటికీ విడివిడిగా జరిగితే మాత్రం ప్రజాధనం వృథా అవుతుందన్నారు.  

వాళ్ల గురించి నేనేం మాట్లాడను 
కాంగ్రెస్‌ నేతలను దూషిస్తూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై జానా స్పందిస్తూ.. ఏదైనా మాట్లాడేటప్పుడు భాష హుందాగా ఉండాలని, కుసంస్కార మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి తానేమీ చెప్పనన్నారు. ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. తమ పొత్తులు రాష్ట్ర ప్రజలు హర్షించేలా ఉంటాయన్నారు. తాను ఎంపీగా పోటీచేయాలా లేక అసెంబ్లీకా అనేది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. 

అది రాజ్యాంగ ప్రతిష్ట 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హత కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోకుండా రాజ్యాంగ ప్రతిష్ట కోణంలో ఆలోచించి అమలు చేయాలని జానా కోరారు. ఈ కేసులో అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు నోటీసులిచ్చిన అంశం కూడా కనబడటం లేదా అని ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి వెంటనే అమలు చేయాలని, కేసును సాగదీయడం మంచిది కాదన్నారు.    

మరిన్ని వార్తలు