ఫుల్‌ డిమాండ్‌

23 May, 2018 09:09 IST|Sakshi
ప్రిస్టేజ్‌ రిసార్టు వద్ద జేడీఎస్‌ ఎమ్మెల్యేలు, మద్దతుదారులు

పదవుల కోసం జేడీఎస్‌ ఎమ్మెల్యేల గళం

రిసార్టు వద్ద హంగామా

దొడ్డబళ్లాపురం: నాకు మంత్రి పదవి ఇవ్వాలి, లేదు.. నాకే దక్కాలి, పార్టీ కోసం నేనే ఎక్కువ పనిచేశా.. జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో ఇలా పదవుల కోసం పోటీ నెలకొంది. జేడీఎస్‌ హైకమాండ్‌ తన 37 మంది ఎమ్మెల్యేలను దేవనహళ్లి–నందికొండ మార్గంలోని ప్రిస్టేజ్‌ గోల్ఫ్‌ షైర్‌ రిసార్టులో ఉంచిన సంగతి తెలిసిందే. మంగళవారంనాడు రిసార్టు రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. ఉదయం 6 గంటల నుండే ఆయా ఎమ్మెల్యేల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరాసాగారు. తమ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ అక్కడున్న మీడియాలకు ఇంటర్వ్యూలివ్వడం ప్రారంభించారు. మద్దతుదారులను పోలీ సులు లోపలకు వెళ్లనివ్వకపోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వచ్చి వారిని కలుసుకుని ముచ్చటించి వెళ్లిపోయారు.

నేనొక్కడినే...
మొదట చింతామణి నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ జేడీఎస్‌లో రెడ్డి సామాజిక వర్గం నుండి గెలిచింది తానొక్కడినే అన్నారు. అందులోనూ చిక్కబళ్లాపురం జిల్లాలో కూడా జేడీఎస్‌ పార్టీ తరఫున గెలిచింది కూడా తానేనన్నారు. అందువల్ల రెండవసారి గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వడంలో తప్పేం లేదన్నారు.

బీజేపీ నాకూ గాలం వేసింది
దేవనహళ్లి ఎమ్మెల్యే నిసర్గ నారాయణస్వామి బీజేపీ వారు తనకు కూడా ఫోన్‌ చేసి గాలం వేశారని, అయితే కాల్‌ రికార్డు చేయడం తెలియకపోవడం వల్ల వారి పేర్లు చెప్పలేకపోతున్నానన్నారు. తాను మంత్రి పదవికి అర్హుడేనని, రేస్‌లో ఉన్నానని చెప్పారు. మధ్యాహ్నం రిసార్టుకు చేరుకున్న ఎమ్మెల్సీ శరవణ మాట్లాడుతూ కుమారస్వామి సీఎం అవుతారని తాను రెండు నెలల క్రితమే చెప్పానని, అప్పుడే తాను స్వీట్లు కూడా పంచానన్నారు. రాష్ట్రంలోపర్యటించి పార్టీ గెలుపునకి కృషి చేశానని, తనకు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమన్నారు.

ప్రమాణోత్సవం తరువాత మళ్లీ రిసార్టుకు
మాజీ మంత్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే బండెప్ప కాశప్పనవర్‌ బుధవారంనాడు కుమారస్వామి ప్రమాణోత్సవానికి జేడీఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ వెళ్తామన్నారు. కార్యక్రమం ముగిశాక తిరిగి రరిసార్టుకు వస్తామన్నారు. గురువారం అసెంబ్లీలో బలనిరూపణ తరువాత ఎమ్మెల్యేలు అందరూ వారివారి నియోజకవర్గాలకు వెళ్తామన్నారు. బుధవారంనాడు ఏ జేడీఎస్‌ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదని తెలిపారు.

ఎమ్మెల్యేలతో నిఖిల్‌గౌడ భేటీ
ఇలా ఉండగా సోమవారం రాత్రి 9 గంటలకు రిసార్టుకు విచ్చేసిన కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ రాత్రి రెండు గంటల వరకూ ఎమ్మెల్యేలతో చర్చించారు. కుమారస్వామి బిజీగా ఉండి రాలేకపోయినందున తాను వచ్చానని మీ విన్నపాలు డిమాండ్లు ఏమున్నా నిరభ్యరంతంగా తనకు చెప్పుకోవాలని,తాను కుమారస్వామికి చేరవేస్తానని ఎమ్మెల్యేలతో చెప్పినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు కూడా తమతమ విన్నపాలు నిఖిల్‌కు విన్నవించుకున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు