అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌

10 Jun, 2018 15:54 IST|Sakshi
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జస్టిస్‌ చంద్రకుమార్‌

పెద్దపల్లి టౌన్‌/గోదావరిఖని : ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కెసీఆర్‌ అసమర్థతతో అప్పుల రాష్ట్రంగా మారిందని తెలంగాణ ప్రజలపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. పెద్దపల్లి, గోదావరిఖనిలో శనివారం రైతు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద వైఖరితోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రభుత్వాలు ఎరువుల, పురుగు మందుల, నకిలీ విత్తనాల కంపెనీలతో లాలుచీ పడి రైతుల గోస పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వివిధ రాజకీయ పార్టీలు రైతు అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసుకొని నేతలకు పునరావాసం కల్పిస్తున్నారే తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్‌ సింగ్‌ రైతులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మర్గామని అన్నారు.

నరేంద్రమోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాధామోహన్‌ సింగ్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు పథకం పేరుతో బడాబాబులకు లబ్ధిచేకూర్చేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతును రైతుగా గుర్తించని కేసీఆర్‌ తాను ఒక రైతునని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కొంతమంది మంత్రులు, శాసస సభ్యులు, బ్యూరోక్రాట్లు వందల ఎకరాల భూములుండి రైతుబంధు కింద వచ్చిన డబ్బును తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నామని ప్రకటిస్తున్నారని, భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం అలాంటి భూస్వాములపై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

భూశుద్ధీకరణతో ఏఒక్క రైతుకు లబ్ధి చేకూరలేదని.. రైతుబంధు పథకంలో తప్పులు దొర్లాయని గగ్గొలు పెడుతున్న, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల చేతుల్లో చావుదెబ్బ తప్పదన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకివస్తే రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా చట్టాలు రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కొంత మంది రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నెల 17న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రైతు సదస్సులో ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు. జిల్లాలోని రైతులందరు అధిక సంఖ్యలో హాజరై రైతు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర రైతు బాధ్యులు ఏసీ రెడ్డి, వసీంరాజా, గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో టి.సారయ్య, రామనర్సయ్య, రమేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు