అందుకే సింధియా రాజీనామా: ​మాణిక్య

11 Mar, 2020 11:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింధియా రాజీనామా, పార్టీ నుంచి బహిష్కరణ, ఎమ్మెల్యేల తిరుగుబాటు తదితర అంశాలతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో 18 ఏళ్లపాటు పార్టీకి సేవలు అందించినప్పటికీ సింధియాకు సముచిత గౌరవం దక్కనందువల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో త్రిపుర రాజవంశీయుడు, సింధియా కజిన్‌ ప్రద్యోత్‌ మాణిక్య దేవ్‌​ వర్మన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు తెలిసినంత వరకు రాహుల్‌ గాంధీని కలవడానికి సింధియా గత కొన్నినెలలుగా తీవ్రంగా ప్రయత్రిస్తున్నారు. అయినా ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. రాహుల్‌ మా మాటలు వినాలని అనుకోకపోతే.. అసలు మమ్మల్ని పార్టీలోకి ఎందుకు తీసుకువచ్చినట్లు’’ అని మాణిక్య ప్రశ్నించారు. కాగా త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌గా వ్యవహరించిన మాణిక్య కొన్ని నెలల క్రితం ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే.(‘సింధియా’ రాజీనామాపై ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌)

ఇక ప్రస్తుతం సింధియా నిర్ణయం సరైనదేనన్న మాణిక్య... ‘‘ గత రాత్రి నేను సింధియాతో మాట్లాడినపుడు.. మా నాయకుడి అపాయింట్‌మెంట్‌ దొరికే అవకాశం లేదని నాకు చెప్పాడు. నిజానికి రాహుల్‌ గాంధీ నుంచి పార్టీ పగ్గాలు చేజారినపుడే ఒక్కసారిగా అనేక మార్పులు సంభవించాయి. అకస్మాత్తుగా మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. అప్పటి నుంచే పలువురు ‘ప్రముఖులు’  కీలక విషయాల్లో మా నిర్ణయాలు, విధానాలను వ్యతిరేకించడం మొదలుపెట్టారు’’ అని తన ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు. అందుకే యువ నాయకులు ఒక్కక్కరుగా పార్టీని వీడుతున్నారని అభిప్రాయపడ్డారు.

కాగా మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన జ్యోతిరాదిత్య సింధియా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. సింధియా సహా పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో మధ్యప్రదేశ్‌లో కాషాయ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మాత్రం తన సర్కారు వచ్చిన ఢోకా ఏమీ లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.(ఆ విషయం చరిత్రే చెబుతోంది: మహానార్యమన్‌)

మరిన్ని వార్తలు