‘సుజనా, అశోక్‌ అందుకే రాలేదు’

5 Feb, 2018 16:27 IST|Sakshi
మంత్రి కాలువ శ్రీనివాసులు

సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, అందుకే టీడీపీ పోరాటం చేస్తోందని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఇప్పటివరకు సీఎం చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మంత్రులు, ఎంపీల వద్ద ప్రస్తావించారని సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యక్తిగత ఆరోపణలు చేశారని, వీటిని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి వేరే పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్లే పార్లమెంట్‌లో ఆవరణలో టీడీపీ ఎంపీలు నిర్వహించిన నిరసనలో పాల్గొనలేదని వెల్లడించారు. మంత్రుల గైర్హాజరుపై విభిన్న కథనాలు విన్పిస్తున్నాయి. తమ పదవులకు ముప్పు వాటిల్లుతుందన్న భయంతోనే టీడీపీ మంత్రులు తమ కార్యాలయాలకే పరిమితమైయారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతూ, అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న భయంతోనే ఇద్దరు మంత్రులు ధర్నాలో పాల్గొనలేదని ప్రచారం జరుగుతోంది. ధర్నాకు ఎందుకు రాలేదన్న దానిపై మంత్రులు నోరు విప్పలేదు.

రాజ్‌నాథ్‌తో భేటీ
తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఏడాదిలోగా అన్ని హామీలు అమలయ్యేలా చొరవ చూపాలని రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు