కర్ణాటకలో శరవేగంగా మారుతున్న సమీకరణలు

2 Apr, 2018 16:40 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూనే మరోవైపు కీలక నేతలతో పాటు, సినిమా నటులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. తాజాగా  కన్నడ సూపర్‌ స్టార్‌ సుదీప్‌ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం ఆయన జేడీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు హెచ్‌.డి ​​కుమార స్వామితో సమావేశమయ్యారు. దీంతో సుదీప్‌ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త తెరపైకి వచ్చింది. 

అయితే ఈ విషయాన్ని సుదీప్‌ ఖండించారు. కుమారస్వామిని తాను  మర్యాదపూర్వకంగానే కలిశానని పేర్కొన్నారు. కాగా రాజకీయ విషయాల పైనే రెండు గంటలపాటు సుదీప్‌తో చర్చించామని జేడిఎస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు తెలిపారు. గతంలో జేడీఎస్‌ అధి నేత దేవగౌడ సుదీప్‌ని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.  

మరో వైపు బీజేపీకి చెందిన మాజీ మంత్రి హరతాళ్‌ హాలప్ప కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మరో బీజేపీ మాజీ మంత్రి కూడా హస్తం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మాజీ బీజేపీ మంత్రి బీఎస్‌ అనంద్‌ సింగ్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇలా అన్ని పార్టీల నుంచి వలసలు, కొత్త వాళ్లు రాజకీయాల్లోకి రావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెతిస్తున్నాయి.

మరిన్ని వార్తలు