కర్ణాటకంలో ‘నోటుకు ఓటు’ దాసోహం

11 May, 2018 18:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వాడిగా, ‘వేడి’గా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంతిమ అంకం ప్రారంభమైంది. చల్లగా నోట్లు చేతులు మారుతున్నాయి. ఓట్లు కొనేవారికి, అమ్మేవారికి మధ్య అనూహ్య ఆత్మీయ బంధం అలుముకుంటోంది. ‘జన్‌ధన్‌’ ఖాతా కలిగిన ప్రతి ఓటరు అకౌంట్‌లోకి వెయ్యి రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల రోజున అంటే, మే 15వ తేదీన మరో వెయ్యి రూపాయలు ఆ ఖాతాలకు వచ్చి చేరుతాయట. ఈ లెక్కన కర్ణాటకలో ఓటుకు రెండు వేల రూపాయలు పలుకుందని స్పష్టం అవుతుంది. ఎన్నికల కమిషన్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు 136 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ కనుగప్పి ఓట్ల వ్యాపారం బాగానే కొనసాగుతోంది. 

నేడు ఒక రాష్ట్రమంటూ కాకుండా ‘ఓటుకు నోటు’ సంప్రదాయం దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అది పార్లమెంట్‌ ఎన్నికలయినా, అసెంబ్లీ ఎన్నికలయినా సంప్రదాయం కొనసాగాల్సిందే. 2008లో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఓట్లను కొనుక్కునే సంప్రదాయం మొదటిసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. నోటు తీసుకొని ఓటు వేసిన వారి సంఖ్య 2008లో ఏడు శాతం ఉంటే అది 2014 ఎన్నికల నాటికి 15 శాతానికి పెరిగిందని ‘సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌’ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు వారి శాతం మరింత పెరిగే ఉంటుంది. దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ ప్రభావంగానే ఈ నోటుకు ఓటు సంస్కతి కొనసాగుతుందని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల్లో, ఓటర్లలో నైతికతను పెంచడం వల్ల ఈ దుస్సంప్రదాయాన్ని శాశ్వతంగా అరికట్టవచ్చని ఎవరైనా భావించవచ్చు. ఆ నైతికత ఎలా రావాలన్నది కూడా ఈ సామాజిక, ఆర్థిక పరిస్థితులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. 

నిరుద్యోగం, పేదరికం.....
దేశంలోని నిరుద్యోగం, పేదరికం, నైపుణ్య, అనైపుణ్య రంగాల్లో కనీస వేతనాలు ఎంత? కనీస వేతనాలపై బతికే కార్మిక లోకమెంత? మధ్యతరగతి వారు ఎంత? తదితర అంశాలపై ఆధారపడి ఓటుకు నోటు సంప్రదాయం కొనసాగుతుంది. సాధారణంగా ధనిక రాష్ట్రాలకన్నా  పేద రాష్ట్రాల్లో ఓటుకు రేటు ఎక్కువ పలుకుతుంది. ‘నువ్వా, నేనా’ అన్నట్లు పోటీ ప్రతిష్టాత్మకంగా మారిన సందర్భాల్లో కూడా రేటు పెరుగుతుంది. కర్ణాటకలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు మూడు వందల రూపాయలు పలగ్గా ఇప్పుడది రెండువేల రూపాయలకు చేరుకుంది. కారణం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా, ఉత్కంఠంగా  మారడమే. గత ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం కర్ణాటకలో కనీస వేతనం 12,270 రూపాయలు. ఆ మొత్తంలో ఒక్క రోజు ఓటు వేస్తే 17 శాతం డబ్బులు ముడుతాయి. కర్ణాటకలో నిరుద్యోగం 2.6 శాతమే ఉన్నప్పటికీ రోజు కూలీ దొరకుతుందన్న గ్యారెంటీలేని జీవితాలు ఎన్నో. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూడా రోజుకు 236 రూపాయలే దొరకుతాయి. అది కూడా వందరోజులు మాత్రమే గ్యారంటీ. అలాంటి పరిస్థితుల్లో నోట్ల ప్రలోభానికి కాదు, నోట్ల ఒత్తిడికి ఎంత మందో గురవుతారు. 

రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారుతుంటోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో గుండు గుత్తాగా 150 ఓట్లకు లక్ష రూపాయలు పలికింది. అంటే ఒక్కో ఓటుకు 666.66 రూపాయలు అన్నమాట. ఈ విషయాన్ని ఆ ఎన్నికల్లో సీతాపూర్‌ నియోజకవర్గం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన షెవాలీ మిశ్రా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలికిన మూడు వందల రూపాయలతో పోలిస్తే 666 రూపాయలు రెండింతలకన్నా ఎక్కువ. యూపీలో ఇప్పుడు కనీస వేతనం నెలకు 7,613 రూపాయలే. అంటే, కర్ణాటకకంటే 4,657 రూపాయలు తక్కువ. యూపీలో నిరుద్యోగం శాతం కూడా 5.5. కర్ణాటకకన్నా 2.9 శాతం ఎక్కువ. 

పంజాబ్‌లో 2009లో ఓటు రేటు 
ప్రత్యక్ష సాక్షిగా మాజీ జర్నలిస్ట్‌ మన్‌ప్రీత్‌ రంధావ రాసిని వ్యాసం కూడా ఇక్కడ గమనార్హమే. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌, బటిండా నియోజకవర్గంలోని మన్సా పోలింగ్‌ కేంద్రానికి ఆయన ఓటు వేయడానికి వెళ్లారు. ఆయన వద్దకు ఓ అకాలీదళ్‌ కార్యకర్త వచ్చి ఓటువేస్తే ‘యూ విల్‌బీ పెయిడ్‌’ అని చెప్పారట. అప్పుడు అకాలీదళ్‌ తరఫున హరిసిమ్రాట్‌ కౌర్‌ బాదల్‌ పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ తరఫున రణిందర్‌ సింగ్‌ పోటీ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ కుమారుడే రణిందర్‌ సింగ్‌. ఓటు వేసిన తర్వాత అకాలీదళ్‌ కార్యకర్త చెప్పిన ఓ అతిపెద్ద భవనం వద్దకు వెళ్లి ఓటరు గుర్తింపు కార్డు, ఓటువేసినట్లు సిరా మరక చూపి ఓటర్లు డబ్బులు తీసుకోవాలట. అక్కడ మనిషికి 200 రూపాయలు ఇచ్చారట. ఆ విషయాన్ని ఆయన అప్పుడు పనిచేస్తున్న ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’లో రాసినా అధికారులెవరూ ఆ భవనంపై దాడి చేయలేదట. ఎలాంటి చర్యా తీసుకోలేదట. 

ఆమ్‌ ఆద్మీ పోరాటం
అవినీతికి వ్యతిరేకంగా కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అరవింద్‌ కేజ్రివాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ 2013, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటుకు నోటు సంప్రదాయంపై పరోక్ష యుద్ధం చేసింది. ‘ఏ రాజకీయ పార్టీ ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీకే వేయండి’ అంటూ కేజ్రివాల్‌ ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటువేసే వారు అవినీతి పరులని అలాంటి వారి దగ్గర డబ్బు తీసుకోవడం అవినీతి కిందకు రాదని, పైగా వారికి బుద్ధి చెప్పిట్లు అతుందన్నది అప్పుడు ఆయన వాదన.  2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పిలుపు ఏ మేరకు ప్రభావం చూపించిందోగానీ, 2015 ఎన్నికల్లో అద్భుత ప్రభావాన్ని చూపించింది. 70 అసెంబ్లీ సీట్లకుగాను ఆయన పార్టీకి 67 సీట్లు వచ్చాయి. 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే వ్యూహాన్ని అనుసరించి బోల్తా పడ్డారు. ఆ ఎన్నికల్లో కొన్ని పార్టీలు గురద్వార్‌లకు, ఆలయాలకు ఓటర్లను తీసుకెళ్లి అక్కడే డబ్బులు పంచి ఒట్టు వేయించుకున్నారు. గుళ్లూ గోపురాల వద్దకు రావడానికి ఇష్టపడని ఓటర్ల వద్దకు నాయకులే వెళ్లి పవిత్ర గ్రంధాల మీద, దేవుళ్ల పటాలపై ఒట్లు వేయించుకున్నారు. 

ఓటుకు నోటు ఎవరు తీసుకుంటున్నారు?
ఎక్కువ వరకు రెక్కాడితేగాని డొక్కాడని పేదలు, మధ్యతరగతిలో ఓ మోస్తారు మంది ఓటుకు నోటు ఒత్తిడికి గురవుతున్నారు. ‘ఇక మా జీవితాలు ఇంతే. ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా మా బతుకులు మారవు. మా కూడుకు మేము కష్టపడాల్సిందే’ అన్న నిర్లిప్తత పెరిగిన పేదలు, ‘ ఏ రాజకీయ పార్టీ, ఎవరొచ్చినా పెద్దగా మారేదేముందీ! ఎలాగైనా మన బతుకుల్ని మనం బాగుచేసుకోవచ్చు. మనకుండే నెట్‌వర్క్‌ మనకు ఉండనే ఉంటుంది’ అని భావించే మధ్యతరగతి మనుషులు ‘నోటకు ఓటు’ వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు