నెలాఖర్లో మంత్రివర్గ విస్తరణ!

4 May, 2019 02:34 IST|Sakshi

జూన్‌ 2వ తేదీ లోపు పూర్తిస్థాయి మంత్రివర్గం 

మరో ఆరుగురికి చోటు 

ఒక సీనియర్‌ మంత్రికి ఉద్వాసన.. ఇద్దరు మహిళలకు చోటు!

ఇప్పటికే కేబినెట్‌ కూర్పు పూర్తి చేసిన సీఎం కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా మార్పులు 

సీఎల్పీ విలీనం తర్వాతే ముహూర్తం ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అదే సంఖ్యలో కీలక పదవులలో ఉన్న వారు అవసరం. దీంతో జూన్‌ 2లోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని, ప్రభుత్వంలోని కీలకమైన పదవులన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం.. వంటి అంశాల ఆధారంగా మంత్రులుగా ఎవరెవరికి అవకాశం వస్తుందనేది పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరి చేరిక ఖాయమైంది. ఈ నేపథ్యంలో 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ శాసనసభ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కానుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకుతోడు కొత్తగా వస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కల్పించేలా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. 

సమీకరణల ఆధారంగా 
రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వంలో సీఎంతోపాటుగా 17 మంది మంత్రులు ఉంటారు. ప్రస్తుత మంత్రివర్గంలో 11 మంత్రులే ఉన్నారు. మరో ఆరుగురు కొత్తగా మంత్రులు చేరే అవకాశం ఉంటుంది. గత ఏడాది డిసెంబరు 13న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడు కేసీఆర్‌ సీఎంగా, మహమూద్‌ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. 2నెలల తర్వాత (ఈ ఏడాది ఫిబ్రవరి 18న) మంత్రివర్గ విస్తరణ జరిగింది. అప్పుడు మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో మరో ఆరుగురు మంత్రులుగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుత రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీల నుంచి ముగ్గురు, ఎస్సీ, మైనారిటీ, వెలమ వర్గాల నుంచి ఒక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం లేదు. వీటితోపాటు ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్‌ కసరత్తు మొదలుపెట్టారు. కొత్తగా చేర్చుకునే ఆరుగురి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ జాబితాలో మార్పులు జరిగే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఉమ్మడి జిల్లాల సమీకరణాల ఆధారంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఒక సీనియర్‌ మంత్రిని తొలగించి అదే జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ కీలక నేతకు అవకాశం ఇస్తారని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. 

  • ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రస్తుతం ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలోనూ కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఈటల రాజేందర్, కేటీఆర్‌ మంత్రులుగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తదుపరి విస్తరణలో కచ్చితంగా చోటుదక్కే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ఇద్దరినీ కొనసాగిస్తూ కొత్తగా కేటీఆర్‌ ప్రభుత్వంలో చేరితే.. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రుల సంఖ్య మూడుకు చేరుతుంది. అయితే ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉంటారా అని టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. 
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా స్పీకర్, 2 మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఇదే రకమైన ప్రాధాన్యత ఉండనుంది. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాల్సి ఉంది. అలాగే ఎస్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఎస్టీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం ఉండనుంది. ఎస్సీ లోని ప్రధానమైన మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు అవకాశం దక్కనుంది. 
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి చామకూర మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లా నుంచి మరొకరికి మంత్రిగా అవకాశం దక్కే పరిస్థితి ఉంది. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండా లని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పి.సబితారెడ్డి శాసనసభలో సూచించారు. దీనికి సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించారు. అనంతరం పరిణామాలతో సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ సీఎల్పీ విలీనం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో సబితారెడ్డికి చోటు దక్కే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 
  • మెదక్‌ ఉమ్మడి జిల్లా నుంచి సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మంత్రులుగా ఎవరూ లేరు. గత ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ కీలకనేత టి.హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారు. తదుపరి విస్తరణలో హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 
  • మంత్రివర్గంలో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఒకే స్థానంలో గెలిచింది. బీసీల్లోని ప్రధాన మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి ఈసారి మంత్రివర్గంలో ఎవరికీ చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తరుఫున గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుకు అవ కాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే శాసనమండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌కు అవకాశం ఇస్తే వనమాకు అవకాశం విషయంలో పరిస్థితి మరోరకంగా ఉండనుంది. అలాగే మంత్రివర్గంలో ప్రస్తుతం ఎస్సీల్లోని ప్రధానమైన మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేదు. సత్తుపల్లిలో టీడీపీ తరుఫున గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 
  • నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. కీలకమైన శాసనసభ స్పీకర్‌గా ఇదే జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు మంత్రి, విప్‌ పదవులు దక్కాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ఇప్పటికే రెండు కీలక పదవులు ఉన్న నేపథ్యంలో మూడో పదవి వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 
  • ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ శాసనమండలి తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. విద్యాసాగర్‌ను త్వరలోనే పూర్తిస్థాయి చైర్మన్‌గా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కకపోవచ్చని తెలుస్తోంది. 
  • ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు 2 మంత్రిపదవులు, చీఫ్‌ విప్‌ పదవి దక్కింది.  సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు మరొకరు మంత్రిగా ఉండే అవకాశం కనిపించడంలేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేల్లో ఒకరికి చీఫ్‌ విప్‌/విప్‌ పదవి వరించే అవకాశం ఉంది. 
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రస్తుతం ఎస్‌.నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలోనూ ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు. ఈ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం ఉండదని తెలుస్తోంది. 
  • హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి మహమూద్‌ అలీ, తలసాని మంత్రులుగా, టి.పద్మారావు శాస నసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కొత్తగా ఎవరికీ పదవి దక్కే అవకాశం లేదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇతర కీలక పదవులు 
శాసనమండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌కు అవకాశం ఇవ్వనున్నారు. డిప్యూటీ చైర్మన్‌ పదవిని ఎవరికి కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే శాసనసభలో చీఫ్‌ విప్, విప్‌ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. శాసనమండలిలో చీఫ్‌ విప్‌గా ఉండే పాతూరి సుధాకర్‌రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి విప్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఈ పదవిని ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే మరొకరికి విప్‌గా అవకాశం దక్కనుంది. కీలక పదవుల కేటాయింపులో సీనియర్‌ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, గంగుల కమలాకర్, బాజిరెడ్డి గోవర్దన్, కోనేరు కోనప్ప, గంప గోవర్దన్, ఆత్రం సక్కు, గొంగిడి సునీతల పేర్లను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు