‘బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారు’

31 Mar, 2019 19:00 IST|Sakshi

సాక్షి, వనపర్తి : రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటోందని కేసీఆర్‌ అన్నారు. వనపర్తిలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ‌.. ఎవరి జాతకాలు ఏంటో ఎన్నికల తరువాత తెలుస్తుందన్నారు. దేశంలో ప్రాంతీయపార్టీల హవా నడుస్తోందని, ఎన్డీయేకు 150, కాంగ్రెస్‌ 100 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే.. దేశ రాజకీయ గమనం మార్చుతామని, ఫెడరల్‌ ఫ్రంట్‌లో మనమే కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చాలా మంది నాయకులు తమతో కలిసివస్తారని తెలిపారు. ప్రజా దర్భారులుపెట్టి సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడిని ఎవరూ అడ్డుకోలేదన్నారు.

సర్పంచ్‌ కూడా మోదీలాగా మాట్లాడరని కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. నిన్న పాలమూరులో మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని అన్నారు. వారు అభివృద్ది చేస్తానంటే నేను అడ్డుపడ్డానని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ.24వేలకోట్లు ఇవ్వాలని స్వయంగా నీతిఆయోగ్‌ సూచించినా.. ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐదేళ్లలో ఏం చేశారో చెపొచ్చుకదా అని మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో రైతులకు 24గంటలు ఉచితంగా కరెంట్‌ ఇచ్చేది కేవలం తెలంగాణే అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు డబ్బులు ఇవ్వాలని మోదీకి 500ఉత్తరాలు రాశానన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇన్ని అబద్దాలు చెప్పొచ్చా అని విమర్శించారు. 

మరిన్ని వార్తలు