కమ్యూనిస్టు కోటలో కాంగ్రెస్‌ ‘కుట్టి’

22 Mar, 2019 12:06 IST|Sakshi
దళిత యువ కెరటం.. రమ్యా హరిదాస్‌

రమ్యా హరిదాస్‌.. ఇప్పుడు కేరళని కుదిపేస్తోన్న పేరిది. నిజానికి కాంగ్రెస్‌ ఆశించింది జరిగితే కమ్యూనిస్టుల కంచుకోట కేరళలో దళిత యువ కెరటం, 32 ఏళ్ల రమ్యా హరిదాస్‌ ఎంపీ అవుతుంది. 2019 కేరళ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ఒక సాధారణ దినసరి కార్మికుడి కూతురు రమ్యా హరిదాస్‌ని కాంగ్రెస్‌ పోటీకి నిలబెట్టింది.కేరళ పార్లమెంటు అభ్యర్థుల మొత్తం జాబితాలో ఇద్దరు మహిళల పేర్లే ఉన్నాయి. అందులో రమ్యా హరిదాస్‌ని రాహుల్‌ ఎంపిక చేశారు. బహుశా కాంగ్రెస్‌ వర్గాల్లో అత్యధిక మంది అభీష్టానికి భిన్నంగా కూడా రాహుల్‌ వ్యవహరించి ఉంటారని భావిస్తున్నారు. 2010లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ యువ నాయకత్వం కోసం సాగించిన వెతుకులాటలో స్థానిక దళిత సామాజిక వర్గానికి చెందిన 32 ఏళ్ల రమ్యా హరిదాస్‌ రాహుల్‌గాంధీ దృష్టిని ఆకర్షించారు. మంచి వాగ్ధాటి, విషయాలపై అవగాహన, సృజనాత్మకత దళితుల అభివృద్ధి అంశాలపై మంచి పట్టు కలిగిన రమ్యని రాహుల్‌ తెరపైకి తెచ్చారు.

రోజుకూలీ కుటుంబంలో పుట్టి..
రమ్య రోజు కూలీ చేసుకుని బతికే దళిత కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి హరిదాస్‌ కోజికోడ్‌ జిల్లాలోని కున్నామంగళమ్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. మహిళా కాంగ్రెస్‌ నాయకురాలైన తల్లి రాధ స్ఫూర్తితో ఆమె అడుగుజాడల్లో రమ్య అతి చిన్న వయసులోనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ప్రారంభించారు. మొట్టమొదట కేరళ కాంగ్రెస్‌ విద్యార్థి సంఘంలోనూ, ఆపై యువజన కాంగ్రెస్‌లోనూ గత పదేళ్లుగా చురుకైన కార్యకర్తగా పనిచేస్తోన్న రమ్య 2010లో కోజికోడ్‌ యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొంతమంది యువతని ఎంపిక చేసి వారికి విదేశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గత కాంగ్రెస్‌ ప్రభుత్వం. అందులో భాగంగా మన దేశం నుంచి జపాన్, మలేసియా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో జరిగిన వరల్డ్‌ యూత్‌ కార్యక్రమాలకి వెళ్లిన పది మంది ప్రతినిధుల్లో రమ్య ఒకరు. కున్నమంగళం పంచాయతీకి ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

అంతకన్నా ముఖ్యంగా స్థానికంగా ఆదివాసీలు, దళితుల సమస్యలపై అవగాహనను పెంచుకుని, ప్రస్తుతం వివిధ అంశాలపై శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లోనే కాక సంగీతంలోనూ  రమ్యా హరిదాస్‌కి ప్రవేశం ఉంది. మ్యూజిక్‌లో పీజీ కూడా చేశారు. ప్రదర్శనల్లోనూ, సభల్లోనూ ఆమె ఉపన్యాసాలే కాకుండా సందర్భోచితమైన సినిమా పాటలూ, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్నారామె. అలత్తూర్‌ పార్లమెంటు స్థానానికి రమ్య పేరు వినిపించడంతో రమ్య గతంలో పాడిన పాటలూ, ఆమె ఉపన్యాసాలూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కొండను ఢీకొంటోంది..
స్థానికంగా ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తోన్న అనేక మంది సీనియర్‌ నాయకులున్నా పాలక్కాడ్‌ జిల్లాలోని అలత్తూర్‌ పార్లమెంటు స్థానానికి రమ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే కాంగ్రెస్‌లో అభ్యర్థుల జాబితా తయారవుతున్నప్పుడే రమ్య పేరు వినిపించింది. మహిళలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితులూ, అలత్తూర్‌లో ప్రత్యామ్నాయం లేకపోవడం, ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడానికి తోడు రమ్య సామాజిక చైతన్యం వెరసి ఆమెకు ఈ అవకాశం వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. సీసీఐఎం నేత పీకేబిజూ 2009 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతోన్న అలత్తూర్‌లో గెలుపు అంత సులభమేం కాకపోయినా రమ్యాహరిదాస్‌ పెద్దకొండనే ఢీకొనాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు