‘యురేనియంపై టీఆర్‌ఎస్‌ రెండు నాలుకల ధోరణి’

19 Sep, 2019 18:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  టీఆర్‌ఎస్‌ పార్టీ యురేనియం తవ్వకాలపై రెండు నాలుకల ధోరణితో  వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి  విమర్శించారు. గతంలో యురేనియం తవ్వకాలకు టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక సంప్రదింపుల తరువాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, అయితే ఇప్పటి వరకు యురేనియం తవ్వకాల గురించి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అనేక ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలపై పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యురేనియం తవ్వాకాలపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని, గతంలో  అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు యురేనియం నిక్షేపాల వెలికితీత గురించి అన్వేషణలు చేశాయని మంత్రి కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు నల్లమలలో యురేనియం గురించి పరిశోధనలు చేసిందని, అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ఊసరవెల్లిలా మాటలు మార్చుతుందని ఆరోపించారు. ​కేంద్ర పభుత్వం అనేక సంప్రదింపుల తర్వాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసిందని మండిపడ్డారు. గ్యాస్‌, బొగ్గు, బంగారం, సీసం, విద్యుత్‌ ఎంత ఉన్నదో తెలుసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని, కాగా ఇంత వరకు అసలు ఎంత యురేనియం ఉందో ఇంకా తేల్చలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు